కరోనా అంటే అందరికీ భయమే. ఎక్కడ తమకి సోకుతుందో అని అంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకుతున్నారు. ఇక పాజిటివ్ వచ్చిన వారిలో చాలా మంది భయంతోనే ప్రాణాలు విడుస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ యువతి కరోనా చికిత్య తీసుకుంటూ.., లవ్ యూ జిందగీ పాట వింటూ ఓ వీడియోలో కనిపించింది. ఆమె చేతికి సెలైన్, నోటికి ఆక్సిజన్. చాలా సీరియస్ కండీషన్. ఒక రకంగా చెప్పాలంటే ప్రాణాలకి గ్యారంటీ లేదు. ఇలాంటి సమయంలో ఆ యువతి పాటలు వింటూ తన జీవితాన్ని ప్రేమిస్తూ కనిపించింది. ఈ ఒక్క వీడియో దేశంలోని కోట్ల మందికి ధైర్యాన్ని ఇచ్చింది. కరోనా వచ్చినా.., ఎంత గుండె దైర్యంతో ఉండాలో నేర్పింది. కానీ.., ఇంతటి దైర్యం, జీవితంపై ప్రేమ ఆమెని కాపాడలేకపోయాయి. ఏ కరోనానైతే ఆమె లెక్కచేయలేదో, అదే మహమ్మారి ఆమెని తిరిగిరాని లోకాలకి తీసుకు పోయింది.
ఆ యువతి లవ్ యూ జిందగీ పాట వింటున్న వీడియోను ప్రపంచం దృష్టికి తీసుకొచ్చిన డాక్టర్ మోనికానే… ఆమె ఇక లేదన్న చేదు వార్తను కూడా ట్విటర్ ద్వారా తెలిపింది. గురువారం రాత్రి ఆమె ఈ ట్వీట్ చేసింది. ఎంతో ధైర్యవంతురాలైన ఆ యువతి ఇక లేదని చెప్పడానికి చాలా బాధపడుతున్నాను. ఆమె కుటుంబానికి, ఆమె రాకకోసం ఎదురు చూస్తున్న చిన్నారి కోసం ప్రార్థించండి అని డాక్టర్ మోనికా ట్వీట్ చేసింది. కొవిడ్తో రెండు వారాల పాటు పోరాడిన ఆ యువతి వయసు కేవలం 30 సంవత్సరాలే. ఆమెకు ఓ చిన్నారి కూడా ఉంది. అయితే.., ఈ లవ్ జిందగీ యువతి ఎవరో, ఆమె పేరేంటో ఇప్పటి వరకూ ఎవరికీ తెలియదు. కానీ.., ఆ వీడియో చాలా మందిని కదిలించింది. కళ్ల ముందు చావు కనిపిస్తున్నా.. అంత చలాకీగా ఆడిపాడుతూ అసలు జీవితం అంటే ఏంటో చెప్పిన ఆ యువతి ఇక లేదన్న వార్తను వాళ్లు తట్టుకోలేకపోతున్నారు. తనను మృత్యువు కబళిస్తున్నా.. చివరి నిమిషం వరకూ ఆమె తన జీవితాన్ని ప్రేమించిన తీరు మాత్రం ఎంతో మందికి ఆదర్శం.