ప్రజల మధ్య చారిత్రక, రాజకీయ, ఆర్ధిక, సాంస్కృతిక అసమానతలు, విభేదాలు, వివిధ ప్రాంతాల మధ్య నెలకొన్న భావోద్వేగాలు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిలూదుతూ వచ్చాయి. తొలిదశ ఉద్యమంలో జరిగిన తప్పులను బేరీజు వేసుకుంటూ మలి దశ ఉద్యమ జెండా ఎత్తారు కేసీఆర్. తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేరిన రోజు. ప్రజల స్వప్నం సాకారమైన దినం. 58 ఏళ్ల పాటు వివక్షకు గురై సొంత రాష్ట్రం సాధించుకొని నీళ్లు, నిధులు, నియమాకాల ట్యాగ్‌లైన్‌తో దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. గత ఆరేళ్లుగా ప్రజల ఆకాంక్షల కోసం పనిచేస్తూ దేశానికే తలమానికంగా నిలిచింది. అభివృద్ధి పథంలో ముందుకెళుతోంది. ఉద్యమ నేత కేసీఆర్ సీఎంగా రెండోసారి పదవీ చేపట్టి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమయ్యారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్రరాష్ట్రం వెరుపడిన సమయంలో తెలంగాణ కలిసేందుకు ఒప్పుకోలేదు. కానీ 58 ఏళ్ల పాటు అణచివేతకు గురైంది. 1969లో తొలిదశ ఉద్యమం తీవ్రస్థాయికి చేరింది. ఓయూలో విద్యార్థుల పోరాటం, మృతితో పీక్ చేరింది. తర్వాత మరుగునపడిపోయింది. కానీ తెలంగాణ మేధావులు, విద్యావేత్తలు తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకత గురించి సమయం, సందర్భం వచ్చినప్పుడల్లా తమ గళం వినిపిస్తూనే ఉన్నారు.
2001 ఏప్రిల్ 21వ తేదీన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవీకి రాజీనామా చేసి మలిదశ తెలంగాణ ఉద్యమానికి అంకురార్పణ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారు. మే 17వ తేదీన కరీంనగర్‌లో సింహగర్జన సభ నిర్వహించి రాజకీయ ప్రక్రియ ద్వారానే తెలంగాణ సాధ్యమని తెలంగాణ కోసం ఎలుగెత్తి గొంతెత్తి నినాదించారు. 2001 సెప్టెంబర్‌లో సిద్దిపేట అసెంబ్లీ నుంచి కేసీఆర్ విజయం సాధించారు. పార్టీ ఆవిర్భవించిన అనతికాలంలోనే ప్రజలు కేసీఆర్‌కు విజయం కట్టిపెట్టారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదం మార్చి 1వ తేదీన ఆమోదం తెలిపారు. మార్చ్ 4వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుకు ప్రభుత్వ రాజముద్ర ప్రచురించింది. జూన్ 2వ తేదీ 2014న తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. తెలంగాణ ప్రజల సుదీర్ఘ స్వప్నం సాకారామైంది. ఈ శుభసందర్భాన్ని పురస్కరించుకుని దేశ ప్రధాని, ఇతర ప్రముఖులు అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు.