విధి ఆమె జీవితంతో వింత నాటకం ఆడింది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అయినా బాధను దిగమింగుకుని జీవితంలో ముందుకు సాగిపోతుంది. పిన్ని, బాబాయిల చెంత ఉంటూ చదువు సాగించింది. పెళ్లీడు రాగానే ఓ మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు పిన్ని, బాబాయి
విధి ఆమె జీవితంతో వింత నాటకం ఆడింది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోయారు. అయినా బాధను దిగమింగుకుని జీవితంలో ముందుకు సాగిపోతుంది. పిన్ని, బాబాయిల చెంత ఉంటూ చదువు సాగించింది. పెళ్లీడు రాగానే ఓ మంచి అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు పిన్ని, బాబాయి. హాయిగా సాగిపోతున్న సంసారంలో ఆనందం నెలకొల్పుతూ.. యువతి కడుపులో కాయ కాయబోతుందున్న శుభవార్త వినిపించింది. తమ కడుపున తన తల్లిదండ్రులు పుట్టబోతున్నారన్న సంబంరంలో మునిగిపోయింది మహిళ. అంతలో విధికి కన్నుకొట్టింది. ఆమె ఆనందాన్ని హరించేస్తూ.. తల్లి, బిడ్డలను ఏకకాలంలో తిరిగి రాని లోకాలకు తీసుకెళ్లిపోయింది.
హృదయ విదారకమైన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. లింగంపల్లిలోని వెంకట్ రెడ్డి కాలనీలో ఉండే శ్రీనిక.. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో, పిన్ని, బాబాయి చక్రాల స్వప్న, కృష్ణల వద్ద పెరిగింది. శ్రీనికను అన్ని తామై చూసుకున్న పిన్ని, బాబాయిలు ఆమెను చదివించారు. అనంతరం పటాన్ చెరులోని రుద్రారానికి చెందిన శ్రవణ్‌కుమార్‌కు ఇచ్చి పెళ్లి చేశారు. మంచి భర్త, అంతలోనే ఆమె కడుపులో నలుసు పడిందన్న శుభవార్తతో ఆ ఇంట్లో ఆనందాలు వెల్లువిరిశాయి. మెడికల్ చెకప్ కోసం లింగంపల్లిలోని పిన్ని ఇంటికి వచ్చింది. బుధవారం స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చెకప్ చేయించుకుంది.
గురువారం ఉదయం 7.30 గంలకు బిల్డింగ్ రెండో అంతస్తు వరండాలో వాకింగ్ చేస్తోంది. అదే సమయంలో కళ్లు తిరిగి ప్రమాదవశాత్తూ.. రెండో ఫ్లోర్ ర్యాంప్ పై నుండి గ్రౌండ్ ఫ్లోరులో పడిపోయింది. తీవ్రంగా గాయపడిన శ్రీనికను హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ కన్నుమూసింది. శ్రీనిక అప్పుడప్పుడు కళ్లు తిరిగి పడిపోయేదని కుటుంబసభ్యులు తెలిపారు. పిన్ని స్వప్న ఇచ్చిన కంప్లయింట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.