హైదరాబాద్- ప్రశాంత్ కిశోర్.. భారత్ లో ఈ పేరు తెలియని రాజకీయ నాయకుడు ఉండరేమో. ఎందుకంటే ప్రధాని మోదీ నుంచి మొదలు పలు రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిశోర్. ఆంద్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారంలోకి రావడానికి కూడా ప్రశాంత్ కిశోరే వ్యూహాలు రచించారు. ప్రశాంత్ కిశోర్ ఎన్నికల వ్యూహాలు రచించారంటే ఇక గెలుపు ఖాయం అన్న పేరు ఉంది.
ఇక ఇప్పుడు ప్రశాంత్ కిశోర్ శిష్యులు సైతం రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారు. తెలంగాణలో ఓ రాజకీయ పార్టీకి ప్రశాంత్ కిశోర్ టీం మేంబర్ రాజకీయ వ్యూహకర్తగా నియమింపబడ్డారు. అవును వైఎస్ షర్మిలకు కొత్త వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ శిష్యురాలు ప్రియ నియమితులయ్యారు. ప్రియ ఇక నుంచి షర్మిలకు రాజకీయ వ్యూహకర్తగా వ్యవహరించనున్నారు. తమిళనాడు డీఎంకే ఎమ్మెల్యే రాజేంద్రన్ కూతురే ఈ ప్రియ. ఈ మేరకు ప్రియ లోటస్ పాండ్‌లో షర్మిలను కలిశారు.
సోషల్ మీడియాతో పాటు, పార్టీ వ్యూహాలపై షర్మిలకు వ్యూహకర్తగా ప్రియ సలహాలు, సూచనలు చేయనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక తమిళనాడులో ఓ మీడియా సంస్థకు ప్రియ అధినేతగా ఉండటం విశేషం. జూలై 8వ తేదీన తెలంగాణలో వైఎస్ షర్మిల కొత్త రాజకీయ పార్టీని ప్రకటించబోతోంది. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆమె పార్టీ పేరు ప్రకటించనున్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిల తెలంగాణలోని పలు సమస్యలపై నిరసనలు, ఆందోళలు చేశారు.
తెలంగాణలో తాను పెట్టబోయే రాజకీయ పార్టీ బలోపేతంపై షర్మిల ఇప్పటి నుంచే దృష్టి సారించారు. ఇంఈ మేరకే షర్మిల కొత్త వ్యూహకర్తను నియమించుకున్నారని తెలుస్తోంది. మరి ఏ మేరకు వైఎస్ షర్మిల పార్టీకి కొత్త వ్యూహకర్త ప్రియ రాజకీయ వ్యూహాలను రచిస్తుందో అన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.