ఫిల్మ్ డెస్క్- సినిమా స్టార్ హీరోలకు కార్లు మీద మోజు ఎక్కువ. మన టాలీవుడ్ లోను చాలా మంది హీరోలు కొత్త కార్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. మార్కెట్లోకి ఏ కొత్త కారు వచ్చినా కొనేస్తుంటారు స్టార్ హీరోలు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సైతం కార్ల కలెక్షన్ చేసే హాబీ ఉంది. ఎన్టీఆర్ గ్యారేజ్ లో ఇప్పటికే సుమారు 20 కార్లున్నాయి. తాజాగా ఎన్టీఆర్ అత్యంత్య విలాసవంతమైన, అద్భుతమైన ఫీచర్లు ఉన్న లంబోర్ఘిని ఉరస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కొనుగోలు చేశారు.
దీంతో భారత్ లో మొట్టమొదటి లంబోర్ఘిని ఉరుస్ గ్రాఫైట్ క్యాప్సూల్ కారను కొన్న వ్యక్తిగా ఎన్టీఆర్ రికార్డ్ సృష్టించారు. ఈ కారు ఆన్ రోడ్ ధర అక్షరాల 3 కోట్ల 43 లక్షల రూపాయలు. తాజాగా హీరో శ్రీకాంత్ తో కలిసి ఎన్టీఆర్ ఈ లగ్జరీ కారు ముందు ఫొటో దిగగా ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇక ఎన్టీఆర్ కు కొత్త కార్లు కొనడంతో పాటు, ఆ కార్లకు ఫ్యాన్సీ నెంబర్లు తీసుకోవడం పరిపాటి. అందులోను ఎన్టీఆర్ కార్లకు 9999 నెంబర్ ఉండటం ఆయన సెంటిమెంట్. ఈ సారి కొన్న లాంబోర్గినీ కారుకు సైతం భారీ ధర పెట్టి నెంబర్ ను కొనుగోలు చేశారు ఎన్టీఆర్. ఖైరతాబాద్ ఆర్టీఏ అధికారులు ఫ్యాన్సీ నంబర్లకు తాజాగా వేలం వేశారు. ఇందులో ఎన్టీఆర్ 17 లక్షల రూపాయలు పెట్టి TS 09 FS 9999 నంబర్ దక్కించుకున్నారు.
మంగళవారం జరిగిన ఈ ఫ్యాన్సీ నంబర్ల వేలంలో ఎన్టీఆర్ దే పెద్ద బిడ్ అని ఆర్టీఏ అధికారులు తెలిపారు. గతంలోను బీఎండబ్లూ కారు కోసం ఎన్టీఆర్ ఇదే నెంబర్ కోసం పది లక్షలు ఖర్చు చేశారు. ఎన్టీఆర్ కు ఉన్న కార్లన్నింటికీ ఇదే నంబర్ ఉండడం విశేషం. తాత రామరావు, తండ్రి హరికృష్ణ కూడా ఇదే నంబర్ కార్లను ఉపయోగించేవారట. అందుకే ఎన్టీఆర్ కు ఈ 9999 నంబర్ అంటే అంత ఇష్టమని చెప్పారు. అంతే కాకుండా ఎన్టీఆర్ ట్విట్టర్ ఖాతా కూడా @tarak9999 అనే ఉండడం విశేషం.
ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయ్యాాక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఇలా సినిమాల్లో నటిస్తూనే.. ఎవరు మీలో కోటీశ్వరులు షోతో బుల్లితెర ప్రేక్షకులను సైతం అలరిస్తున్నారు ఎన్టీఆర్.