హైదరాబాద్- తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కొవిడ్ కేసులతో పాటు, మరణాల సంఖ్య కూడా బాగా తగ్గింది. మే 12 నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి రాగా.. అప్పటి నుంచి కరోనా కేసులను బట్టి ప్రభుత్వం లాక్ డౌన్ సడలింపులు ఇస్తూ వస్తోంది. ప్రస్తుతం ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఈనెల 19తో ముగియబోతోంది. 20వ తేదీ నుంచి రాష్ట్రంలో మరిన్ని లాక్ డౌన్ సడలింపులు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు లాక్ డౌన్ నుంచి సడలింపులు ఇచ్చారు. ఈ నెల 20 తేదీ నుంచి సడలింపు సమయాన్ని రాత్రి 9 గంటల వరకు పొడిగించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలుపై ఒకటి రెండు రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. లాక్ డౌన్ సడలింపులో భాగం ప్రస్తుతంగా ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని రకాల వ్యాపార కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి మరో గంట సమయం ఇస్తున్నారు. అంటే సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కఠిన లాక్ డౌన్ అమల్లో ఉంది. అయితే ఈ నెల 19వ తేదీతో ప్రస్తుత లాక్‌డౌన్ ఉత్తర్వుల గడువు ముగియనుండటంతో, ఆ తర్వాత రాత్రి కర్ఫ్యూ మాత్రమే కొనసాగించాలనే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
ఈనెల 20 నుంచి ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అన్ని రకాల కార్యకలాపాలను అనుమతించే అవకాశం ఉందని అధికారులు చెబు తున్నారు. అంతే కాదు ప్రజలు తమ గమ్య స్థానాలకు చేరుకోవడానికి రాత్రి 10 వరకు వెసులుబాటు కల్పించి, రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తున్నటు సమాచారం. ఇక రాష్ట్రంలో పలు చోట్ల లాక్ డౌన్ ను ఎక్కువ సమయం అమలు చేయనున్నారు. ఖమ్మం జిల్లాలోని సత్తుపల్లి, మధిర.. నల్గొండ జిల్లాలోని నల్లగొండ పట్టణం, నాగార్జునసాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడలో మరో 10 రోజుల పాటు కఠిన లాక్ డౌన్ అమల్లో ఉండనుందని తెలుస్తోంది.