నేషనల్ డెస్క్- సోనూసూద్.. ఇప్పుడు భారతదేశమంతా ఈ పేరు తెలియని వారుండరు. గత యేడాది కరోనా మహమ్మారి ప్రబలినప్పిటి నుంచి ఆయన చేస్తున్న సాయం అంతా ఇంతా కాదు. పోయిన సంవత్సరం దేశమంతా లాక్ డౌన్ విధిస్తే తమ తమ సొంత ప్రాంతాలకు వెళ్లలేక వలస కార్మికులు పడిన కష్టాలను చూసి చలించిన సోనూసూద్.. ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేసి వారిని సొంత రాష్ట్రాలకు పంపించి తన పెద్ద మనసును చాటుకున్నారు. ఇక అప్పుడు మొదలుపెట్టిన సమాజసేవ నిరంతరం కొనసాగుతూనే ఉంది. కార్మికులతో పాటు కరోనా రోగులను తరలించేందుకు బస్సులు, రైళ్లు, విమానాల వరకు ఏదంటే అది ఏర్పాటు చేస్తూ అందరిని ఆదుకుంటూనే ఉన్నారు. కరోనా కష్టకాలంలో తమకు సాయం కావాలని అడిగితే చాలు నేనున్నానంటూ ఆపన్నహస్తం అందిస్తున్నారు సోనూసూద్. ఓ రైతు పొలం దున్నలేక కూతుళ్లతో నాగలి పట్టిస్తే ట్రాక్టర్ సమకూర్చినా, ఓ విధ్యార్ధినికి ఆన్ లైన్ క్లాస్ కోసం ట్యాబ్ ఇప్పించినా, ఓ చిన్నారికి ఆనారోగ్యం చేస్తే వైద్యం చేయించినా, ఓ కరోనా రోగి ప్రాణాపాయంలో ఉంటే ప్రత్యేక విమానం ద్వార ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించినా.. ఇలా ఏది చేసినా అది సోనూసూద్ కే చెల్లింది.
ఇక ఇప్పుడు మామూలు జనమే కాదు సెలబ్రేటీలు సైతం సోనూసూద్ ను హెల్ప్ కావాలని అడుగుతున్నారంటే ఆయనపై ఉన్న నమ్మకం ఎంతటిదో మనం అర్ధం చేసుకోవచ్చు. సామాన్యులైనా.. ప్రముఖులైనా.. ఎవరు ఈ సాయం కావాలన్నా లేదు.. కాదు అని చెప్పకుండా నిరంతరం హెల్ప్ చేస్తూనే ఉన్నారు. కరోనా కష్టకాలంలో ఆక్సీజన్ కొరత ఉండి ప్రభుత్వాలే చేతులెత్తిసిన పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఎవరికి ఎక్కడ ఆక్సీజన్ కావాలన్నా పంపించి నేనున్నానని ధైర్యం పోస్తున్నారు ఈ రియల్ హీరో సోనూసూద్. ప్రాంతాలు, రాష్ట్రాలతో సంబందం లేకుండా దేశవ్యాప్తంగా ఎవరు ఏ సాయం కోరినా వెంటనే స్పందిస్తున్నారు. ఇక ఇప్పుడు ప్రభుత్వ అధికారులు సైతం సోనూసూద్ ను సాయం కోరుతున్నారు. నెల్లూరు నెల్లూరు జిల్లా కలెక్టర్ సోనూసూద్ కు ఓ లేఖ రాశారు. జిల్లాలో కరోనా కేసులు పెరిగిపోయాయని, ఆక్సీజన్ జనరేటర్ ఉంటే కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందించవచ్చని లేఖలో పేరొన్నారు కలెక్టర్ ఛక్రధర్ బాబు. నెల్లూరు జిల్లా ప్రజల కోసం ఒక ఆక్సీజన్ జనరేటర్ ను సాయం చేయాలని లేఖలో సోనూసూద్ కు విజ్ఞప్తి చేశారు.
కలెక్టర్ విజ్ఞప్తికి వెంటనే స్పందించారు రియల్ హీరో. తప్పకుండా సాయం చేస్తానని మాటిచ్చారు. నెల్లూరుకు 1కోటి 50 లక్షల విలువ చేసే ఆక్సీజన్ జనరేటర్ ను పంపిస్తానని కలెక్టర్ కు మాటిచ్చారు సోనూసూద్. ఈ జనరేటర్ ద్వార ప్రతి రోజు ఆక్సీజన్ ను ఉత్పత్తి చేయవచ్చట. దీంతో జిల్లాలోని కరోనా రోగులను మెరుగైన ఆక్సీజన్ ను అందిచవచ్చు. రెండు రోజుల్లో ఆక్సీజన్ జనరేటర్ ను నెల్లూరుకు పంపిస్తానని కలెక్టర్ కు హామీ ఇచ్చారు సోనూసూద్. దీంతో నెల్లూరు జిల్లా ప్రజలతో పాటు దేశమంతా హర్షం వ్యక్తం చేస్తోంది. ఓ జిల్లా మొత్తానికి అధికారి అయిన కలెక్టర్ సాయం కోరిన వెంటనే స్పందించిన సోనూసూద్ మంచి హృదయాన్ని అంతా మరోసారి మెచ్చుకుంటున్నారు. ఆయన నిస్వార్ధంతో సమాజానికి చేస్తున్నసేవ ఈ దేశం ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటుందని అంతా కామెంట్ చేస్తున్నారు. ఎంతో మంది డబ్బులున్నవారు, ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు, కార్పోరేట్ కంపెనీలు చేయలేని పనిని ఒకే ఒక్కడు సోనూసూద్ చేస్తున్నారంటే ఆయనను మనమంతా ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన చేస్తున్న నిస్వార్ధ సేవను పదిమందికి తెలియజేయడం ద్వార ప్రభుత్వాలతో పాటు, సాయం చేసే స్థితిలో ఉండి కూడా మిన్నకుండినవారిలో కొంతైనా చలనం వస్తుందని సుమన్ టీవి అభిప్రాయం.