కరీంనగర్- దేశంలో అత్యాచారాలు, హత్యలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినా అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. దర్మార్గులు దారుణాలకు పాల్పడుతూన ఉన్నారు. కరీంనగర్ జిల్లాలో ఇంకా కాళ్ల పారాణి ఆరకముందే నవ వధువు హత్యకు గురైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరలా ప్రకారం.. హుజూరాబాద్ ప్రాంతానికి చెందిన 21 ఏళ్ల మ్యాధర ప్రవళిక కు, బొమ్మనపల్లికి చెందిన 28 ఏళ్ల మ్యాదర అనిల్ తో రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా కాపురం చేస్తూ వస్తున్నారు. ఐతే శుక్రవారం మధ్యాహ్నం నవ వధువు అత్తారింట్లో ఒంటరిగా ఉన్న సమయంలో, ఇంట్లోకి బలవంతంగా చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు ప్రవళికను దారుణంగా హత్య చేశారు.
ఆమె భర్త అనిల్ హుస్నాబాద్‌లో బ్యాటరీ షాపు నడుపుతున్నాడు. అనిల్ తల్లిదండ్రులు కూడా ఇంట్లో లేని సమయాన్ని చూసుకుని దుండగులు ఈ హత్య చేశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. కొత్తగా పెళ్లైన నవ వధువును హత్య చేయాల్సిన అవసరం ఎవరికుందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆమెకు పెళ్లికి ముందు ప్రేమ వ్యవహారం ఏమైనా ఉందా అన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పెళ్లైన రెండు నెలలకే హత్యకు గురైన కూతురును చూసి ఆమె తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. పట్టపగలే హత్య జరగడంతో స్థానికులు భయబ్రాంతులకు గురవుతున్నారు.