ఫిల్మ్ డెస్క్- తెలంగాణ ప్రాంతానికిచెందిన కళాకారుడు దర్శనం మొగులయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. 12 మెట్ల కిన్నెరతో పాటలు పాడుతూ ముత్తాల కాలం నాటి కళకు ప్రాణం పోస్తూ వస్తున్నారు మొగిలయ్య. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘భీమ్లా నాయక్’ లో టైటిల్ సాంగ్ ను పాడారు మొగులయ్య.
దీంతో కిన్నెర మొగులయ్య కు మరింత గుర్తింపు వచ్చింది. కేంద్రం పద్మశ్రీ అవార్డు ప్రకటించిన తర్వాత మొగిలయ్య వెళ్లి కేసీఆర్‌ను ప్రత్యేకంగా కలిశారు. కేసీఆర్ ఆయన్ని శాలువాతో సత్కరించడమే కాకుండా, ఆయనకు హైదరాబాద్‌లో నివాస యోగ్యమైన ప్రాంతంలో ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఇతరత్రా ఖర్చుల కోసం కోటి రూపాయలను ప్రకటించారు.
ఇటువంటి సమయంలో ఫిల్మ్ నగర్ లో ఓ ఆసక్తరమైన సంగతి వినిపిస్తోంది. మొగులయ్య మరో సినిమా కోసం పాట పాడబోతున్నారని టాక్. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమాలో కిన్నెర మొగులయ్య పాట పాడబోతున్నారట. ఎన్టీఆర్ హీరోగా త్వరలోనే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్ 30వ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
ఎన్టీఆర్, కొరటాల శివ.. మొగులయ్యతో ఓ పాటను పాడించాలనుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. దీనిపై చిత్రయూనిట్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. పాన్ ఇండియా సినిమాగా ఎన్టీఆర్, కొరటాల శివ మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.