ఒక్కోసారి సెలబ్రిటీలు కులం గురించి మాట్లాడుతూ నోరు జారడం అనేది జరుగుతుంటుంది. ఈ క్రమంలో ఆయా కులాల వారి మనోభావాలు దెబ్బతింటాయి. అయితే ఆ విషయాన్ని అర్ధం చేసుకున్నవారు వెంటనే క్షమాపణలు చెప్పి తమ సంస్కారాన్ని నిలబెట్టుకుంటారు. తాజాగా జర్నలిస్ట్ జాఫర్ పొరపాటున భట్రాజు కులస్తుల విషయంలో నోరు జారారు. అయితే తన తప్పు తెలుసుకుని క్షమాపణ చెప్పారు.
తనదైన శైలిలో ఇంటర్వ్యూలు చేస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి జర్నలిస్ట్ జాఫర్. ఇట్లు మీ జాఫర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రముఖ రాజకీయ నాయకులను, ప్రముఖ సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఈ క్రమంలో బండ్ల గణేష్ ను ఇంటర్వ్యూ చేశారు. అయితే ఈ ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ పొగడ్తల గురించి మాట్లాడుతూ.. భట్రాజు అనే పదాన్ని ప్రయోగించారు. అయితే అది భట్రాజు కులస్తుల మనోభావాలను దెబ్బ తీయడంతో జాఫర్ క్షమాపణలు చెప్పారు. బండ్ల గణేష్ ఇంటర్వ్యూలో ఒక పదం వాడానని, బండ్ల గణేష్ ను ఉద్దేశించి మీ మాటలు పొగడ్తలు భట్రాజు పొగడ్తలుగా ఉన్నాయని, అయితే ఆ పదం వాడినందుకు బాధపడుతున్నానని అన్నారు.
భట్రాజు ఆత్మగౌరవ ప్రతీకగా పిలవబడుతున్న మహిళ, భట్రాజు కమ్యూనిటీకి సంబంధించిన అసోసియేషన్ కి రాష్ట్ర అధ్యక్షురాలు అయిన చంద్రకళ ఆ వీడియో చూసి తనకు కాల్ చేశారని అన్నారు. కాల్ చేసి ఆ పదాన్ని అలా ఎందుకు వాడారని ప్రశ్నించినట్లు జాఫర్ వెల్లడించారు. అయితే జాఫర్ మాట్లాడుతూ.. ఈ పదం వాడినందుకు చాలా బాధనిపించిందని.. తన ఉద్దేశం అది కాకపోయినా ఒక కమ్యూనిటీకి సంబంధించిన పదాన్ని ఇలా ఎందుకు వాడానా అని చాలా చాలా బాధపడుతున్నానని అన్నారు. ప్రమాణం చేసి చెప్తున్నా.. ఎవరినీ కించపరచడం తన ఉద్దేశం కాదని అన్నారు. ఒక కమ్యూనిటీని కించపరిచేందుకు ఆ పదం వాడలేదని.. ఫ్లోలో అన్న మాట అని అన్నారు. కానీ అది రాంగ్ గా అనిపించింది కాబట్టి, మిస్ కమ్యూనికేట్ అయ్యింది కాబట్టి భట్రాజు కమ్యూనిటికీ చెందిన వారు మనసులోకి తీసుకోవద్దని అన్నారు. సిన్సియర్ గా క్షమాపణ చెప్తున్నానని అన్నారు.
ఎందుకంటే భట్రాజు కమ్యూనిటీపై చాలా గౌరవం ఉందని, సమాజానికి సేవ చేసిన కమ్యూనిటీ అని, చదువు నేర్పించిన కమ్యూనిటీ అని అన్నారు. భట్రాజుల వృత్తే చదువు చెప్పడం అని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు చదువు చెప్పిందే భట్రాజు కమ్యూనిటీ వారని అన్నారు. కృష్ణదేవరాయల విజయానికి భట్టుమూర్తే కారణమని అంటారని, పుట్టపర్తి సాయిబాబా లాంటి పెద్ద పెద్ద మహానుభావులు ఉన్న కులం మీదని అన్నారు. ఫ్లోలో వాడాను తప్ప మీ కమ్యూనిటీని ఏ రకంగా కించపరచడం తన ఉద్దేశం కాదని అన్నారు. క్షమాపణ చెప్పడంతో పాటు తన ఇంటర్వ్యూలో ఆ పదాన్ని తొలగిస్తున్నానని అన్నారు. మరోసారి భట్రాజు కులస్తులకు క్షమాపణలు అంటూ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.