మెక్సికోలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దక్షిణ మెక్సికోలోని చియాపాస్ రాష్ట్రంలో వలసదారులతో వెళ్తున్న ఒక ట్రక్కు పాదచారుల రెయిలింగ్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో 53 మంది మరణించగా, 60 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయని సమాచారం. వారిలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. గాయాలపాలైన వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్చి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. బాధితులు సెంట్రల్ అమెరికాకు చెందిన వారని తెలుస్తోంది.
గ్వాటెమాలా సరిహద్దు రాష్ట్రమైన చియాపాస్‌లో ఈ ఘటన జరిగిందని అధికారులు తెలిపారు. వేగంగా ఉన్న వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రమాదం చోటు చేసుకుందన్నారు. వారంతా వలసకార్మికులని, సరైన ధృవపత్రాలు లేకుండా అక్రమంగా అమెరికాకు వెళ్తున్నారని స్థానిక ప్రాసిక్యూటర్ కార్యాలయం ప్రకటించింది. వారు ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపుతప్పి చియాపాస్‌లో రిటైనింగ్ గోడను ఢీకొని బోల్తా పడిందని చెప్పారు.
ట్రక్కులో ఇంకా ఎక్కువ మందే ఉండి ఉంటారని, ప్రమాదం జరిగిన తర్వాత అధికారులకు భయపడి పారిపోయినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర గవర్నర్ రుటిలియో ఎస్కాండన్ సంతాపం తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామన్నారు.