విధి విచిత్రమైనది.ప్రతి మనిషికి రకరకాల పరీక్షలు పెడుతుంది. కానీ.., వాటిని ఎదిరించి నిలిచిన వారే విజేతలు అవ్వగలరు. మెదక్జిల్లా శివ్వంపేట మండలం తాళ్లపల్లి గడ్డ తండాకు చెందిన పవన్ అనే ఇంటర్ విద్యార్థి వ్యక్తిత్వం కూడా ఇలాంటిదే. పవన్ నేపధ్యం అంతా పేదరికం. తల్లిదండ్రులు ఇద్దరు కూలీలు. నిన్న మొన్నటి వరకు లాక్ డౌన్ కారణంగా పనులు దొరక్క అప్పుల పాలు అయిపోయారు. ఇప్పుడు పని దొరుకుతున్నా.., చేసిన అప్పులనే తీర్చలేకపోతున్న పరిస్థితి వారిది. ఇలాంటి సమయంలో పవన్ కి ఆన్లైన్ క్లాస్ లు వినడానికి స్మార్ట్ ఫోన్ కావాల్సి వచ్చింది. కానీ.., చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. పిల్లాడి చదువుకి సాయం చేయాల్సిన బంధువులు మొహం చాటేశారు.
ఇలాంటి సమయంలో ఊరిలో స్నేహితులు పవన్ కి సహకరించారు. అతను క్లాస్ లు వినడానికి వాళ్ళు తమ ఫోన్ ఇచ్చి ఆదుకున్నారు. అయితే.., ఇలా ఎన్ని రోజులు తన స్నేహితులను ఇబ్బంది పెట్టాలి అనుకున్నాడు పవన్! దీంతో.., సొంతగా స్మార్ట్ ఫోన్ కొనుక్కొని క్లాస్ లు వినడానికి అవసరమైన పైసల కోసం కూలీగా మారాడు.
పవన్ నర్సాపూర్ రెసిడెన్షియల్ కాలేజీలో ఇంటర్ సెకండియర్ ఎంపీసీ చదువుతున్నాడు. అతను క్లాస్ లో మంచి ప్రతిభ ఉన్న విద్యార్థి. చదువుకోకపోవడం వల్లే తన తల్లిదండ్రులు కూలీలుగా మిగిలిపోయారు. కాబట్టి.. ఎట్టి పరిస్థితిల్లో చదువు ఆపకూడదు అనుకున్నాడు పవన్. దీంతో.., పవన్ ప్రస్తుతం పొలం పనులకు కూలీగా వెళ్తున్నాడు.
ఇక ఊరిలో వ్యవసాయ పనులు లేనపుడు మేడ్చల్కు వెళ్లి అడ్డా కూలీగా పనిచేస్తున్నాడు. ఇలా పని చేసుకుంటూనే.., స్నేహితుల ఫోన్స్ లో ప్రస్తుతానికి క్లాస్ లు వింటున్నాడు. త్వరలోనే అతను తన కష్టార్జితంతో స్మార్ట్ ఫోన్ కొనడానికి సిద్దమవుతున్నాడు. చూశారు కదా..? చిన్న వయసులోనే పవన్ ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడో? ఆత్మభిమానం మెండుగా ఉన్న ఈ స్టూడెంట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.