నలుగురికి మంచి చేస్తే మనకి మంచే జరుగుద్ది అంటారు. కానీ.., అతను 300 మందికి మంచి చేశాడు. 300 కుటుంబాలకి సేవ చేశాడు. తన డ్యూటీని దైవంలా భావించాడు. ఎంతో చివరి ప్రయాణాలు సాఫీగా సాగడంలో అతనిదే కీలక పాత్ర. కానీ.., ఇంత చేసినా.. విధి మాత్రం ఆయన్ని చిన్న చూపు చూసింది. కరోనా ఫ్రెంట్ లైన్ వారియర్ అయిన ప్రవీణ్ కుమార్ విషాద గాధ ఇది. కరోనాతో కన్నుమూసిన కొన్ని వందలమందికి అంత్యక్రియలు జరిపినప్రవీణ్.. అదే కోవిడ్ సోకి ప్రాణాలు విడిచాడు. ఈ విషాద ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. 44 ఏళ్ల ప్రవీణ్ కుమార్ హిసార్ మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగి. కరోనా వైరస్ రోగుల మృతదేహాలను దహనం చేయడానికి మున్సిపాల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన బృందానికి ప్రవీణ్ అధిపతి. కరోనా వెలుగు చూసినప్పటి నుంచి కోవిడ్తో మృత్యువాతపడిన వారి అంత్యక్రియలు నిర్వహిస్తున్నాడు. ఎలాంటి అనుమానం, భయం లేకుండాఇలా దాదాపు 300కుపైగా జరిపాడు. ఒకానొక దశలో విధి నిర్వహణ కోసం కుటుంబానికి సైతం దూరంగా ఉంటూ.., కరోనా మృతదేహాలకి అంత్యక్రియలు నిర్వహించాడు. బతికున్న కాలమంతా బంధాలు, బాధ్యతలు అంటూ ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండలేము. కనీసం చనిపోయాక అయినా ఆ అంత్యమ యాత్ర ప్రతి ఒక్కరికి సాఫీగా సాగాలి అని ప్రవీణ్ నమ్మేవాడు. ఇందుకోసమే తన వృత్తిలో అస్సలు రాజీ పడేవాడు కాదు.
ఎన్నో అనాధ శవాలకి కూడా ప్రవీణ్ తన సొంత ఖర్చుతో దహన సంస్కారాలు నిర్వహించిన సందర్భాలు ఉన్నాయి. ఇక కరోనా సెకండ్ వేవ్ లో కూడా మరణాల సంఖ్య పెరిగిన విషయం తెలిసిందే. దీంతో ప్రవీణ్ తన విధులలో బిజీ అయ్యాడు. ఈ క్రమంలో ఇటీవల ప్రవీణకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే ప్రవీణ్ ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో ఆసుపత్రిలో చేర్చారు. దురదృష్టవశాత్తు కోవిడ్ సోకిన రెండు రోజులకే ఆయన సోమవారం రాత్రి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. ఎంతో మందికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన ప్రవీణ్ ఇలా మరణించడం స్థానికులను కలిచివేస్తోంది. ప్రవీణ్ అంత్యక్రియలను కోవిడ్ నిబంధనలు పాటిస్తూ హిసర్ మేయర్ ఆధ్వర్యంలో రిషినగర్లో మంగళవారం జరిపారు. ప్రవీణ్కు భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఇతనిది ఉమ్మడి కుటుంబం. దాదాపు అందరూ మున్సిపల్ కార్పొరేషన్లోనే ఉద్యోగం చేస్తున్నారు. ఏదేమైనా వందల మందికి దహన సంస్కారాలు నిర్వహించిన ప్రవీణ్ అంతిమ యాత్ర ఇలా జరగాల్సి రావడం అందరిని కన్నీరు పెట్టిస్తోంది.