డ్రై ఫ్రూట్స్ ధరలు సామాన్యుడికి అందుబాటులో లేకున్నా ప్రాణం కంటే ఎక్కువ కాదు గనుక దిగువ మధ్య తరగతి ప్రజలు కూడా వాడుతున్నారు. దీంతో డ్రై ఫ్రూట్స్ వ్యాపారాలు మాత్రం ఇంతకు ముందెన్నడూ కనివినీ ఎరుగని స్థాయిలో జరుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇందులో ప్రధానంగా జీడిపప్పు, బాదంపప్పు, ఎండుద్రాక్ష, ఎండు, పండు ఖర్జూరాలు, వాల్‌నట్స్, దోస, పుచ్చ గింజలు తదితరాలు విక్రయిస్తున్నారు. ఇవి తింటే శరీరంలో ఇమ్యూనిటీ పెరుగుతుందని, కరోనా వచ్చినా ధీటుగా ఎదుర్కొవచ్చని ప్రజల్లో నమ్మకం బాగా పెరిగింది. అందుకే విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. శత్రువుతో పోరాడాలంటే మనకు అతనికి మించిన శక్తి కావాలి. ఆయుధాలు లేకపోయినా ఎదుటివాడి దాడిని అడ్డుకునే ఆత్మవిశ్వాసం కావాలి. ప్రస్తుతం కోవిడ్ వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో జనం రోగ నిరోధక శక్తి(ఇమ్యూనిటీ)ని పెంచుకోవాలని, అందుకు పోషకాహారం తీసుకోవాలని భావిస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ శక్తిని పెంచుకోవడం డ్రై ఫ్రూట్స్ తీసుకోవడంతోనే సాధ్యమంటున్నారు.
కరోనా కట్టడిలో భాగంగా రోగ నిరోధకశక్తి పెంచుకోవాలని వైద్యులు సైతం సూచించడంతో జనం వాటిపై మొగ్గు చూపుతున్నారు. కరోనా రానంత వరకు జీడిపప్పు, బాదంపప్పు, ఎండు ద్రాక్ష, ఖర్జూరం తదితరాలను తక్కువగా వాడేవారు. ఈ వైరస్‌ను కట్టడి చేయడానికి డ్రై ఫ్రూట్స్ కూడా ముఖ్యపాత్ర పోషిస్తాయని వైద్యులు చెప్పడంతో వాటిని వినియోగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. కరోనా రాకముందు రోజూ వేల రూపాయల వ్యాపారం మాత్రమే జరిగేది. తోపుడు బండ్లపైన, దుకాణాల ద్వారా లక్షల వ్యాపారం జరుగుతోందని వ్యాపారుల అంచనా.