హెల్త్ డెస్క్- కరోనా సమయంలో ఏం వాడాలో.. ఏం వాడకూడదో అంతు పట్టడం లేదు. ఆహారం నుంచి మొదలు కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల వరకు రోజుకో కొత్త అంశం తెరపైకి వస్తోంది. దీంతో జనాలంతా కంగారుపడిపోతున్నారు. ఇక ఇప్పుడు కరోనా సమయంలో టూత్ బ్రష్ గురించిన ఓ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మనం ప్రతి రోజూ ఉపయోగిస్తున్న టూత్ బ్రష్‌లు కరోనాను వ్యాపింపజేస్తున్నాయని పరిశోధనల్లో తేలింది. కరోనా సోకిన వారు కోలుకున్నాక, అంతకు ముందు ఉపయోగించిన బ్రష్‌లను వాడితే ప్రమాదమని నిపుణులు చెబుతున్నారు. ప్రతి రోజు పళ్లు తోముకునే టూత్ బ్రష్ లతోనూ కరోనా సోకే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు దంత వైద్య నిపుణులు. బ్రెజిల్ లో ఈ అంశంపై జరిపిన పరిశోధకుల్లో ఇదే విషయం తేలిందట. ఇక మన విజయవాడకు చెందిన దంత వైద్యులు సైతం టూత్ బ్రష్ ఉపయోగానికి సంబంధించి పలు అంశాలన తెలిపారు.
ఎవరికైనా కరోనా వైరస్ సోకి, ఆ తరువాత కోలుకున్నాక.. మళ్లీ రెండోసారి కొవిడ్ బారిన పడుతున్న సందర్బాలను వైద్యులు గుర్తించారు. ఈ కేసులపై అధ్యయనం చేసినప్పుడు వాళ్లు అంతకు ముందు వాడిన టూత్ బ్రష్ లనే వాడినట్లు తేలింది. కరోనా రోగులు వాడిన బ్రష్ లపై కనీసం 72 గంటల పాటు వైరస్ బతికే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకని కరోనా రోగులు తాము వాడిన టూత్ బ్రష్ ను, కరోనా నుంచి కోలుకున్నాక ఎట్టి పరిస్థితుల్లోను మళ్లీ ఉపయోగించకూడదని వైద్య నిపుణులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారు పాత టూత్ బ్రష్, టంగ్ క్లీనర్లను పడేసి కొత్తవి ఉపయోగించాలని డాక్టర్లు స్పష్టం చేశారు. కరోనా రోగులు నోటి శుభ్రతకు ప్రాముఖ్యం ఇవ్వాలంటున్న వైద్యులు.. నోట్లో బ్యాక్టీరియా నివారణకు గోరు వెచ్చటి ఉప్పు నీటిని పుక్కిలించాలని చెబుతున్నారు.