హైదరాబాద్- తెలంగాణలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పనిచేస్తున్న వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిపై పని ఒత్తిడి తగ్గించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు స్వల్ప సమయం కోసం తాత్కాలిక ప్రాతిపదికన వైద్య సిబ్బందిని నియమించుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంబీబీఎస్ విద్యను పూర్తి చేసిన అర్హులైన యువ వైద్యుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి ఆదివారం ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మూడు నెలల కాలానికి డాక్టర్లు, నర్సులు, లాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణమే నియమించుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. వీరు కరోనా వంటి కీలక సమయంలో రాష్ట్రం కోసం పనిచేస్తున్నందున వీరి సేవలకు సరైన గుర్తింపునివ్వాలని, భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో వీరికి వెయిటేజీ మార్కులను కలపాలని కేసీఆర్ చెప్పారు. కష్టకాలంలో ప్రజలకు సేవ చేయడానికి యువ డాక్టర్లు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మాసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బంది ముందుకు రావాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.
ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లను తక్షణమే ప్రారంభించి, వైద్య సిబ్బందిని నియమించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలో నిర్మించిన ఎంజీఎం ఆస్పత్రికి చెందిన 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానాను, ఆదిలాబాద్ జిల్లా రిమ్స్‌లోని మరో 250 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖానాను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ ఆస్పత్రి కోసం 363 మంది వైద్య సిబ్బంది, అదిలాబాద్ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ కోసం 366 మంది సిబ్బంది కలిపి మెత్తం 729 మంది నియామకానికి వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పారు. తెలంగాణలో ఆక్సిజన్ , రెమ్‌డిసివిర్ ఇంజక్షన్లు, బెడ్లు, ఇతర కరోనా సౌకర్యాల పరిస్థితిపై అధికారులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు అందుబాటులోనే ఉన్నాయని, ఇతర మందులన్నింటినీ సిద్ధంగా ఉంచామని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ప్రభుత్వ దవాఖానాల్లో మెత్తం 7 వేల 393 బెడ్లు అందుబాటులో ఉన్నాయని, 2 వేల 470 ఆక్సిజన్ బెడ్లు, 600 వెంటిలేటర్ బెడ్లు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. మందులతోపాటు, వైద్య బృందాలు ఎల్లవేళలా అందుబాటులో ఉన్నారని అధికారులు సీఎం కేసీఆర్ కు తెలిపారు.