సైబర్ క్రైం డెస్క్- ఈ మధ్యకాలంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. స్మార్ట్ ఫోన్ లకు రక రకాల మెస్సేజ్ లు పంపిస్తూ మోసారకు పాల్పడుతున్నారు సైబర్ నేరగాళ్లు. ఈ క్రింది లింక్ పై క్లిక్ చేస్తే మీ ఫోన్ రీచార్జ్ అవుతుందనో, లేదంటే కొంత డబ్బు మీ అకౌంట్ లోకి వస్తుందనో ఉరిస్తారు. పొరపాటున సైబర్ నేరగాళ్లు పంపిన లింక్ ను క్లిక్ చేస్తే అంతే సంగతులు. మన బ్యాంకు అకౌంట్ లో ఉన్న డబ్బంతా క్షణాల్లో మాయం అవుతుంది. అందుకే ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా సొమ్మంతా గోవింద అవుతుంది.
ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ వాడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గూగుల్ ప్లేస్టోర్‌లో కొన్ని యాప్స్ వల్ల స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు హాని జరిగే ఛాన్స్ ఉందని హెచ్చరిస్తున్నారు పోలీసులు. ప్రధానంగా పలు యాప్స్‌లో జోకర్ మాల్వేర్ ఉన్నట్లు తెలుస్తోంది. పలు యాప్స్ ద్వారా జోకర్ మాల్వేర్ స్మార్ట్ ఫోన్ లోకి చొరబడి వినియోగదారుల డేటాను సీక్రెట్‌గా దొంగిలిస్తోంది. ఆ తర్వాత ఈ మాల్వేర్ యూజర్ల డేటాతో అడ్వర్టైజ్‌మెంట్ వెబ్ సైట్లలోకి మన ప్రమేయం లేకుండానే వెళ్లి ప్రీమియం సబ్ స్క్రిప్షన్ తీసుకుంటోంది. ఈ విషయం ఫోన్ వాడే వారికి ఏ మాత్రం తెలియదు.
ప్రముఖ సాఫ్ట్ వేర్ సెక్యురిటీ కంపెనీ క్విక్ హీల్ సెక్యూరిటీ నివేదికలో ఇందుకు సంబందించిన పలు విషయాలను తెలిపింది. గూగుల్ ప్లేస్టోర్ లోని 8 యాప్స్‌లో ఈ మాల్వేర్ ఉన్నట్లు గుర్తించారు. ఈ యాప్స్ గురించి గూగుల్‌కు కూడా క్విక్ హీల్ సెక్యూరిటీ తెలియజేసింది. ఈమేరకు గూగుల్ వెంటనే ఈ యాప్స్‌ను తన ప్లేస్టోర్ నుంచి తొలగించింది. ప్రమాదకరమైన 8 యాప్స్ లో Auxiliary Message, Fast Magic SMS, Free CamScanner, Super Message, Element Scanner, Go Messages, Travel Wallpapers, Super SMS ఉన్నాయి. అందుకని ఇలాంటి యాప్స్ ను ఎట్టిపరిస్థితుల్లోను ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోవద్దు. ఒక వేల ఇప్పటికే మీ స్మార్ట్ ఫోన్ లో ఈ యాప్స్ ఉంటే వెంటనే అన్ ఇన్ స్టాల్ చేయండి.