ఫిల్మ్ డెస్క్- డేగల బాబ్జీ.. ఈ పేరు ఎప్పుడైనా విన్నారా.. డేగల బాబ్జీ అంటే టాలీవుడ్ నిర్మాత కం నటుడు బండ్ల గణేష్. అవును బండ్ల గణేష్ హీరోగా నటిస్తున్న సినిమా పేరు డేగల బాబ్జీ. అందులో టైటిల్ క్యారెక్టర్ పోషించబోతున్నాడు బండ్ల గణేష్. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకట్ చంద్ర దర్శకత్వం వహించారు.
త్వరలోనే డేగల బాబ్జీ విడుదల కానున్న నేపథ్యంలో తాజాగా బండ్ల గణేష్ కూతురు ద్రిష్టి చేతుల మీదుగా లిరికల్ వీడియో సాంగ్ ను రిలీజ్ చేశారు. ఈ క్రమంలో డేగల బాబ్జీ మూవీని ఉద్దేశిస్తూ బండ్ల గణేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేషనల్ అవార్డు వచ్చిన తమిళ సినిమాను తెలుగులో నాతో చేస్తున్నారు నా మిత్రుడు వెంకట్ చంద్ర.. ఈ సినిమా అస్సలు చేయనని చెప్పా.. అయినా వదలకుండా ఈ సినిమా బాధ్యతను నా భుజాలపై వేసి నాతో చేయించారు.. అని చెప్పారు.
ఒక రూమ్ లో ఒక సినిమాని రెండు గంటల సేపు ఒక క్యారెక్టర్ చేయడం అనేది చాలా రిస్క్.. సినిమా పూర్తయ్యే వరకు నాలో గుండె దడ దడ, భయం.. కానీ సినిమా అయిపోయిన తర్వాత నన్ను నేను చూసుకొని ఆశ్చర్యపోయా.. నేనేనా ఇలా యాక్ట్ చేసింది అని నాలో నాకే ఆనందం వేసింది.. నటుడిగా నా జీవితానికి ఇది చాలు అనుకున్నా.. అని చెప్పుకొచ్చారు బండ్ల గణేష్.
అంతే కాదు.. పవన్ కళ్యాణ్ గారితో గబ్బర్ సింగ్ సినిమా తీసినప్పుడు ఎంత హాయిగా, ఎంత తృప్తిగా కాలర్ ఎగరేశానో.. నేను చచ్చిపోయిన తర్వాత కూడా గబ్బర్ సింగ్ నిర్మాత అనే గర్వం ఎలా ఉంటుందో.. అలాగే ఈ డేగల బాబ్జి చిత్రం కూడా నాకు అంత తృప్తినిచ్చింది.. ఇక ఈ రోజు విడుదలైన సాంగ్ చాలా అద్భుతంగా వచ్చింది.. లైనస్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చాడు.. ప్రతి ఒక్కరూ కళ్లార్పకుండా ఈ సినిమా చూస్తారు.. బండ్ల గణేష్ ఇంత బాగా యాక్ట్ చేస్తారా అని రెస్పెక్ట్ ఇస్తారు.. ఈ రెస్పెక్ట్ కోసమే నేను 30 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నా.. అని చెప్పారు బండ్ల గణేష్.
ఇక భవిష్యత్తులో నేను యాక్ట్ చేస్తానో లేదో తెలియదు.. కానీ ఈ సినిమా ద్వారా నా జన్మ ధన్యమైందని అనుకుంటున్నా.. అని వ్యాఖ్యానించారు బండ్ల గణేష్.