రెండు దశాబ్దాలకు పైగా అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా.. తనలో ఇంకా పదును తగ్గలేదని ఈ ఇంగ్లిష్ పేసర్ నిరూపించుకుంటున్నాడు. వయసు ఒక అంకె మాత్రమే అని నిరూపిస్తున్న అండర్సన్ మైదానంలో క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ ఆడుతూ ఆశ్చర్యపరుస్తున్నాడు.
టెస్టు క్రికెట్‌లో గంటల తరబడి బౌలింగ్ చేసే పేస్ బౌలర్ల కెరీర్ సుదీర్ఘంగా సాగడం కష్టం. సినిమా హీరోయిన్ల మాదిరే.. ఓ నాలుగైదు సంవత్సరాలు మెరిపించడం ఆ తర్వాత మరుగున పడటం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ.. అయితే దీనికి ఇంగ్లండ్ వెటరన్ పేసర్ జెమ్స్ అండర్సన్ మాత్రం అతీతం. అప్పుడెప్పుడో రెండు దశాబ్దాల క్రితం అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన జిమ్మీ.. ఏళ్లకు ఏళ్లు అలా జట్టులో కొనసాగుతూనే ఉన్నాడు. టెస్టు క్రికెట్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన పేసర్‌గా ఇప్పటికే చరిత్ర సృష్టించిన అండర్సన్.. 41 ఏళ్ల వయసులోనూ కుర్రాళ్లతో పోటీ పడుతున్నాడు. తాజాగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్ నాలుగో టెస్టులో మైదానంలో జిమ్మీ పనులు చూసిన వారెవరూ అతడికి నాలుగు పదుల వయసు దాటిందంటే నమ్మడం కష్టమే!
ఫిట్‌నెస్ పరంగా అత్యుత్తమ స్థితిలో ఉన్న అండర్సన్ యాషెస్ నాలుగో టెస్టులో బంతిని చేతిలోకి తీసుకునేందుకు చేసిన పని అభిమానులను మంత్ర ముగ్దులను చేసింది. నేలపై నుంచి వస్తున్న బంతిని వంగి అందుకోవడానికి బదులు అండర్సన్ దాన్ని కాలితో పైకి లేపాడు. అది కాస్త పక్కకు పోగా.. ఎడమ కాలితో దాన్ని గాల్లోకి మూడు సార్లు పైకి లేపి ఆ తర్వాత కుడి కాలుతో ఫుట్ బాల్ కిక్ ఇచ్చి క్యాచ్ అందుకున్నాడు. సాకర్ స్టార్ ప్లేయర్లు క్రిస్టియానో రొనాల్డో, లియోనెల్ మెస్సీ తరహాలో క్రికెట్ బంతితో జిమ్మీ.. ఫుట్‌బాల్ ఆడిన తీరు ప్రతి ఒక్కరినీ కట్టిపడేసింది. తన కెరీర్‌లో వందల కొద్ది వికెట్లు పడగొట్టిన అండర్సన్.. తాజా యాషెస్ సిరీస్‌లో అంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు. నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఒక్క వికెట్ మాత్రమే పడగొట్టిన జిమ్మీ.. రెండో ఇన్నింగ్స్‌లో ఇంకా ఖాతా తెరవలేదు.
టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకు అత్యధికంగా శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉంటే.. ఆసీస్ దివంగత స్పిన్ లెజెండ్ షేన్ వార్న్ 708 వికెట్లు తీసి రెండో స్థానంలో ఉన్నాడు. వీరిద్దరూ స్పిన్నర్లే కాగా.. 689 వికెట్లతో అండర్సన్ మూడో స్థానంలో ఉన్నాడు. మరో 20 వికెట్లు పడగొడితే.. వార్న్‌ను దాటేసే అవకాశాలున్నాయి. ఇక ఈ జాబితాలో భారత స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే (619) నాలుగో స్థానంలో ఉండగా.. ఇంగ్లండ్‌కే చెందిన స్టువర్ట్ బ్రాడ్ 600 వికెట్లతో ఐదో ప్లేస్‌లో ఉన్నాడు. ప్రస్తుతం కెరీర్ కొనసాగిస్తున్న పేసర్లు.. వీరిద్దరి దరిదాపుల్లో కూడా లేరు.