గత కొన్ని రోజులుగా సినీ పరిశ్రమను వరుసా విషాదాలు వెంటాడుతున్నాయి. అనారోగ్యంతో కొంతమంది అయితే.. అనుకోని ప్రమాదాలతో మరికొంత మంది కన్నుమూయడం తీవ్ర విషాదాలను నింపింది. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణం నుంచి ఇటీవల శివ శంకర్ మాస్టర్, సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి ప్రముఖుల మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర విషాదంలో మునిగిపోయింది. తాజాగా సినీ ఇండస్ట్రీ లో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ నిర్మాణ సంస్థలతో పాటు బ్లాక్ బస్టర్ సినిమాలకు పనిచేసిన డైరెక్టర్ త్యాగరాజన్ బుధవారం ఉదయం చెన్నైలో మృతి చెందారు. అయితే ఆయన రోడ్డు పక్కన అనాథ శవంలా పడి ఉండడం తీవ్ర కలకలం రేపుతోంది.
అరంబుకోట్టైకి చెందిన త్యాగరాజన్ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ పూర్వ విద్యార్థి. పొన్నుపార్క పరేన్ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి వెట్టిమేల్ వెట్రి సినిమాతో దర్శకుడిగా మారారు. ప్రభు హీరోగా వెట్రిమేల్ వెట్రి, విజయకాంత్ హీరోగా మా నగర కావలన్ వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు త్యాగరాజన్. ‘మానగర కావల్’ విజయం తర్వాత కొన్ని కారణాల వల్ల అతనికి సినిమా ఆఫర్లు రాలేదు. దాంతో వేరే సినిమాలకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో పని చేశారు. అవకాశాలు తగ్గడంతో సొంతూరు అరుంబుకోటైకి వెళ్లిపోయారు. అక్కడ ప్రమాదానికి గురైన త్యాగరాజన్ కోమాలోకి వెళ్లారు. కొంత కాలం తర్వాత ఆయన కోలుకున్నారు. తర్వాత మళ్లీ అవకాశాల కోసం చెన్నైకి తిరిగి వచ్చారు.
ఇండస్ట్రీలో త్యాగరాజన్ కి మళ్లీ అవకాశాలు రాలేదు.. దాంతో స్థానిక వడపళణి, ఏవీఎం స్టూడియో సమీపంలో రోడ్డు పక్కన పడుకుని అమ్మా క్యాంటీన్ లో తింటూ బతికేవారు. ఈ క్రమంలో బుధవారం ఉదయం త్యాగరాజన్ కన్నుమూశారు. పోలీసులు అనాథ శవంగా భావించి మృతదేహాన్ని కీల్పాక్కం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దర్శకుడిగా ఓ వెలుగు వెలిగి AVM సంస్థలో 150వ చిత్రానికి దర్శకత్వం వహించిన త్యాగరాజన్ ఇప్పుడు అదే సంస్థ బయట అనాథలా మరణించడం బాధాకరం అంటున్నారు సినీ ప్రియులు. ఈయన గురించి తెలిసిన అప్పటి సినీ వ్యక్తులు త్యాగరాజన్ మృతికి సంతాపం తెలుపుతున్నారు.