టాలీవుడ్ సినీ పెద్దలు ఈరోజు తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సమావేశంలో నిర్మాతలు దిల్ రాజు, దానయ్యలతో పాటు దర్శకులు రాజమౌళి, త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, థియేటర్లలో ఆంక్షలు అంటూ జరుగుతున్న ప్రచారం తదితర అంశాలపై వారు మంత్రితో చర్చించినట్టు తెలుస్తోంది. గత రెండేళ్లుగా కరోనా వైరస్ ఎంటర్ టైన్ మెంట్ రంగంపై భారీగా ప్రభావం చూపించిన విషయం తెలిసిందే.
కరోనా మహమ్మారి ఎఫెక్ట్ తో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్లు, మాల్స్, మల్టీప్లెక్స్ మూతపడ్డాయి. దాంతో దీనిపై ఆధార పడి బతికే వారు వేల సంఖ్యలో ఉపాధి కోల్పోయారు. కరోనా సెకండ్ వేవ్ తర్వాత మళ్లీ థియేటర్లు ఓపెన్ చేశారు. ఇప్పుడిప్పుడే పూర్వవైభవం వస్తుందన్న సమయంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్ లోనూ ప్రవేశించిందన్న వార్తలతో సినీ రంగం ఆందోళన చెందుతోంది. సంక్రాంతి సీజన్ లో పలు పెద్ద సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. ఈ డిసెంబరులోనూ పలు చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి.
ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో థియేటర్లు మూసివేతపై గురించి చర్చించేందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ తో భేటి అయినట్లు సమాచారం. ఈ భేటీలో దిల్ రాజు, ఎస్ ఎస్ రాజమౌళి, త్రివిక్రమ్, నిర్మాత దానయ్య… ఇతర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ భేటీ సుమారు గంటపాటు సాగినట్లుగా తెలుస్తోంది. కాగా, అంతకుముందు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ కొత్త కమిటీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరయ్యారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు, బుల్లితెర రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో సహకారం అందిస్తుందని అన్నారు.