హైదరాబాద్ లో భక్తులు దర్శించుకోవడానికి ఎన్ని ఆలయాలు ఉన్నా.. ముందుగా గుర్తుకు వచ్చేది బల్కం పేట ఎల్లమ్మ గుడి. భక్తుల కొంగు బంగారమైన ఎల్లమ్మతల్లిని నిత్యం భక్తులు దర్శించుకుంటూనే ఉంటారు.
హైదరాబాద్ నగరానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి.. ఇక్కడ సందర్శనీయ స్థలాలు ఉన్నాయి. ప్రసిద్ధి గాంచిన పురాతన కట్టడాలు, దేవాలయాలు, పర్యటక ప్రదేశాలు కలిగిన నగరం ఈ హైదరాబాద్. కుల మత బేధాలు, భాషాంత్యరాలు లేకుండా అందిరిని అక్కున చేర్చుకుంటుంది మన భాగ్యనగరం. ఈ నగరానికి ఇతర రాష్ట్రాల నుండి జీవనోపాధి కొరకు అనేక మంది వస్తుంటారు. హైదరాబాద్ ఏర్పడక ముందునుండి పేరుగాంచిన దేవాలయం బల్కం పేట ఎల్లమ్మ దేవాలయం. భక్తుల కొంగు బంగారమై వారి మనసులలో కొలువై ఉన్న ఎల్లమ్మతల్లిని నిత్యం కొలుస్తుంటారు. ఇక్కడ ఎల్లమ్మ తల్లి పది అడుగుల బావిలో స్వయంభూ గా వెలసింది.
ఈ దేవాలయాన్ని నిర్మించక ముందు రేణుక ఎల్లమ్మ తల్లి నీటి మధ్యలో ఉండేది. భక్తులు గట్టుపై నుండే పూజలు చేసి తమ కానుకలను సమర్పించేవారు. గుడి నిర్మించిన తర్వాత పది అడుగులు లోతుకు మెట్ల ద్వారా దిగాలి. అక్కడ మూలవిరాట్టు ఉంటుంది. ఇక్కడ అమ్మవారి తల భాగం నుంచి నీరు ధారగా పడుతుంది. ఆ నీటిని భక్తులకు తీర్థంగా ఇస్తారు. ఈ నీటి ధార ఎక్కడినుండి వస్తుందో ఇప్పటివరకు అంతు చిక్కని ప్రశ్న. అమ్మవారిని పూజించి మొక్కులు చెల్లించిన వారికి ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం దొరుకుతుందని ప్రజల ప్రగాఢ విశ్వాసం. ఇక్కడ ప్రతి మంగళ, ఆదివారాల్లో ఈ దేవాలయానికి భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకుంటారు.
ఎల్లమ్మకు బోనాలతోపాటు కోళ్లను, మేకలను కూడా సమర్పిస్తారు. ఇంతటి మహిమ గల బల్కం పేట ఎల్లమ్మకు ప్రతియేట కల్యాణోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. ఈసారి కూడా ప్రభుత్వం తరపున ఇవ్వవలసిన కానుకలను సమర్పిస్తామని మంత్రి తలసాని యాదవ్ అన్నారు. అమ్మవారికి ప్రభుత్వం తరపున బంగారు కిరీటం సమర్పించనున్నామని ఆలయ అధికారుల సమక్షంలో తెలిపారు. గుడి ప్రధాన ద్వారాలకు వెండి తాపడం చేయిస్తామని చెప్పారు. దాతల సహాయంతో నిర్మించిన 34 దుకాణాలను మంత్రి తలసాని ప్రారంభించారు. ఆలయ అభివృద్ధికి స్వచ్ఛందంగా దాతలు ముందుకొస్తున్నారని, వారి సహకారంతో మరింత అభివృద్ధి పరుస్తామన్నారు.
గుడికి వచ్చే భక్తులు మొక్కుల రూంలో చెల్లించే బంగారంతో ప్రతియేట అమ్మవారికి ఆభరణాలను చేయిస్తున్నామని ఎప్పటిలాగే ఈ యేడాది కూడా 2.20 కిలోల బంగారంతో అమ్మవారికి కిరీటం చేయిస్తున్నామని మంత్రి తెలిపారు. ప్రతి సంవత్సరం జరిగే రేణుక ఎల్లమ్మ తల్లి కల్యాణోత్సవానికి భక్తులు విశేషంగా తరలి వస్తారు. కల్యాణాన్ని చూసి తరించి వారి మొక్కలు సమర్పించుకుంటారు. అశేషంగా తరలి వచ్చే భక్తులకు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు. కల్యాణ మహోత్సవం నిర్వహణలో ప్రభుత్వం తరపున అమ్మవారికి సమర్పించే కానుకలపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి.