పేద వారు కూడా ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని తీసుకువచ్చింది. దీనిలో భాగంగా నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మిస్తున్నారు. ఇక తాజాగా డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
పేద ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలనే సంకల్పంతో తెలంగాణ సర్కారు డబుల్ బెడ్రూం ఇళ్ల పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద హైదరాబాద్‌లో ఏకంగా లక్ష డబుల్ బెడ్రూం ఇళ్లను నిర్మించి పేదలకు ఉచింతంగా ఇవ్వనుంది. దీనిలో భాగంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు పూర్తి కావడంతో.. ప్రభుత్వం లబ్ధిదారులను ఎంపిక చేసి.. అర్హులైన వారికి ఆ ఇళ్లను అందచేస్తోంది. ఈ క్రమంలో ఆబిడ్స్‌లోని మురళీధర్‌బాగ్‌లో నిర్మించిన 120 రెండు పడక గదుల ఇళ్ల సముదాయాన్ని లబ్ధిదారులకు అందజేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. బీఆర్‌ఎస్ ప్రభుత్వం.. నగరంలో లక్ష రెండు పడక గదుల ఇళ్లను పేదలకు ఉచితంగా నిర్మించి ఇస్తోందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
ప్రస్తుతం లబ్ధిదారులకు అందజేసిన మురళీధర్‌బాగ్‌లో నిర్మించిన ఒక్కో ఇంటికి బహిరంగ మార్కెట్‌లో రూ.కోటి ధర పలుకుతోందని, ఈ లెక్కన పేద కుటుంబాలు కోటీశ్వరులేనని తెలిపారు. హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే రాజాసింగ్‌తో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. అనంతరం తలసాని మాట్లాడుతూ.. ప్రభుత్వం అందజేస్తోన్న ఈ ఇళ్లను అమ్మితే జైలుకు పంపిస్తామని హెచ్చరించారు. వీటిని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా డిజైన్ చేసి రాష్ట్రవ్యాప్తంగా నిర్మించి ఇస్తున్నారని, ఇది రాజాసింగ్ చెప్పినట్లు ప్రధాని ఆవాస్ యోజన కింద వచ్చినవి కావని ఈ సందర్భంగా మంత్రి తలసాని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. మురళీధర్‌బాగ్‌లో రెండు పడక గదుల ఇళ్ల లబ్ధిదారులు అంతా.. ఇక్కడి మోజంజాహీ మార్కెట్‌లో పండ్ల వ్యాపారం చేస్తుంటారని తెలిపారు. వారికి ఇక్కడి మల్గీల (షెడ్లు)ను వారికే కేటాయిస్తే నిర్వహణ ఖర్చును తీర్చినట్లవుతుందన్నారు. అదేవిధంగా మురళీధర్‌బాగ్ పక్కనే ఉన్న మరికొందరు పేదలకు వారి స్థలంలోనే ఇళ్లను కట్టుకునేందుకు ప్రభుత్వం రూ.3 లక్షల సహాయం అందజేయాలని కోరారు. ప్రభుత్వం తమకు డబుల్ బెడ్రూం ఇళ్లను కేటాయించడంపై లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ పథకంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.