సిల్క్ స్మిత ఈ పేరు ఒక సంచలనం. తెర మీద సిల్క్ స్మిత కనబడితే జనం మెంటలెక్కిపోయేవారు. సిల్క్ స్మిత సినిమాలో కనబడిందని తెలిస్తే చాలు.. జనాలు ఎగబడి వెళ్లేవారు. స్మిత ఉంటే సినిమా హిట్టు అని దర్శక, నిర్మాతలు సెంటిమెంట్ గా ఫీలయ్యేంతగా క్రేజ్ సంపాదించుకుంది. వాంప్ పాత్రలే కాకుండా సపోర్టింగ్ రోల్స్ లో కూడా నటించి మెప్పించింది. ఐటం సాంగ్ లకి పెట్టింది పేరు సిల్క్ స్మిత. కమర్షియల్ సినిమాల్లో సిల్క్ స్మిత ఐటం సాంగ్ లేకపోతే అభిమానులు ఒప్పుకునేవారు కాదు. అంతలా ఆమె అభిమానుల హృదయాలను దోచుకుంది. 300కు పైగా సినిమాల్లో నటించిన సిల్క్ స్మిత.. శృంగార తారగా అప్పట్లో చెరగని ముద్ర వేసుకుంది.
సిల్క్ స్మిత అసలు పేరు వడ్లపాటి విజయలక్ష్మి. ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు సమీపంలో కొవ్వలి గ్రామంలో 1960 డిసెంబర్ 2న జన్మించింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగోలేని కారణంగా నాల్గవ తరగతితోనే చదువు ఆపేసింది. చిన్న వయసు నుంచే సినిమాలంటే విపరీతమైన పిచ్చి ఉండేది. సినిమాల్లో నటించాలని అనుకుంది. ఆమె ఊళ్ళో షూటింగ్ జరుగుతుంటే.. రోజూ వెళ్ళేది . ఏదైనా వేషం ఇవ్వమని రోజూ దర్శకుడ్ని బతిమలాడేది. దీంతో చిన్న వేషం ఇచ్చారు. అయితే ఇక్కడ ఉంటే హీరోయిన్ అవ్వలేనని.. చెన్నై వెళ్ళిపోయింది. అక్కడ నటి ఛాయాదేవి ఇంట్లో అద్దెకు ఉంటూ ఆమెతో షూటింగులకు వెళ్ళేది. టచప్ ఆర్టిస్ట్ గా చేరి.. ఆ తర్వాత సినిమల్లో అవకాశాలు దక్కించుకుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా గుర్తింపు తెచ్చుకుంది.
ఆ తర్వాత మలయాళ డైరెక్టర్ ఆంటోనీ ఈస్ట్ మేన్ తెరకెక్కించిన ఇనయే తేదీ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాతోనే విజయలక్ష్మి సిల్క్ స్మితగా పేరు మార్చుకుంది. డైరెక్టర్ ఆంటోనీనే సిల్క్ స్మితకు ఈ పేరు పెట్టారు. అంతకు ముందు తమిళంలో చేసిన వండిచక్రం సినిమాలో ఈమె పాత్ర పేరు సిల్క్. ఇందులో బార్ గర్ల్ గా నటించింది. అలా సిల్క్ పేరుకి స్మిత చేర్చి ‘సిల్క్ స్మిత’ అని పెట్టారు దర్శకుడు ఆంటోనీ. అలా సిల్క్ స్మితగా మారిన విజయలక్ష్మీ కెరీర్ రాకెట్ లా దూసుకుపోయింది. తన నిషానిచ్చే మత్తు కళ్లు, సె*క్స్ అప్పీల్ కారణంగా క్యాబరే డ్యాన్సర్ గా, వాంప్ పాత్రలు చేయాలని నిర్ణయించుకుంది. అయితే ఒక్కసారి స్మిత ఇలా కనబడిన తర్వాత ప్రేక్షకులు రుచి మరగడంతో ఆమెను శృంగార తారగానే చూడాలనుకున్నారు.
దీంతో సిల్క్ స్మిత.. ఆ శృంగార తార అన్న ట్యాగ్ నుంచి బయటపడలేకపోయింది. అప్పట్లో ఆమెను సాఫ్ట్ పో*ర్న్ స్టార్ అని పిలిచేవారు. అంతలా క్రేజ్ దక్కించుకున్న సిల్క్ స్మిత.. హీరోల స్థాయిలో పారితోషికం తీసుకునేది. అలా హీరోలతో పాటు సమానమైన పారితోషికం తీసుకున్న ఏకైక నటిగా అప్పట్లో ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లు హీరోలతో పాటు సమానంగా పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అలాంటిది అప్పట్లోనే హీరోలతో సమానంగా పారితోషికం తీసుకున్న ఏకైక నటిగా పేరు తెచ్చుకుంది. అంతెందుకు అప్పట్లో ఆమె కొరికిన యాపిల్ ని వేలం వేస్తే.. వేలంలో 25 వేలుకి వెళ్ళింది. అప్పట్లో అదొక సంచలనంగా మారింది. అంతటి క్రేజ్ ఉన్న సిల్క్ స్మిత.. రాకెట్ దూసుకుపోతున్న సిల్క్ స్మిత కెరీర్ ఉన్నట్టుండి ఒక్కసారిగా నేలకొరిగిపోయింది.
నిర్మాణ రంగంలో అడుగుపెట్టి సినిమాలు తీయడం.. అక్కడ నష్టాలు చూడడం.. తన మేనేజర్ ని నమ్మి మోసపోవడం.. వంటి కారణాలతో ఆర్థికంగా దెబ్బతిన్నది. కొందరు దర్శకులు ప్రేమ పేరుతో మోసం చేయడంతో మానసికంగా దెబ్బతిన్నది. దీంతో సిల్క్ స్మిత 35 ఏళ్లకే తన జీవితానికి ముగింపు పలికేసుకుంది. 1996లో సెప్టెంబర్ 23న తన ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా ది డర్టీ పిక్చర్ సినిమా వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో సిల్క్ స్మిత పాత్రలో బాలీవుడ్ హీరోయిన్ విద్యాబాలన్ నటించింది. అయితే సిల్క్ స్మిత పుట్టినరోజు నాడే ఈ సినిమాని రిలీజ్ చేయడం విశేషం. ఈ సినిమా 2011 డిసెంబర్ 2 రిలీజై సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది.