ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థివదేహాన్ని జూబ్లీహిల్స్ లోని ఫిలిం ఛాంబర్ వద్ద అభిమానుల కడచూపు కోసం ఉంచారు. ఆయన భౌతికకాయానికి పెద్ద ఎత్తున ప్రముఖులు, అభిమానులు నివాళి అర్పిస్తున్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి పార్థీవదేహానికి నివాళులు అర్పించేందుకు రచయిత, నటుడు తనికెళ్ల భరణి బుధవారం ఫిల్మ్ ఛాంబర్‌కు వచ్చారు. సిరివెన్నెల పార్థీవదేహాన్ని చూస్తూనే కన్నీటి పర్యంతమయ్యారు. సిరివెన్నెలతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పారు.
తెలుగు ఇండస్ట్రీలో ఓ మహావృక్షం నేలరాలిపోయిందని కన్నీటి పర్యంతం అయ్యారు తనికెళ్ల భరణి. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కౌగిలించుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. సిరివెన్నెల సతీమణిని తనికెళ్ల భరణి పరామర్శించారు. మేం ఇద్దరం ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చాం. స్రవంతి మూవీస్ మాకు వేదిక అన్నారు. స్రవంతి మూవీస్ లో ఎన్నో సినిమాలకు కలిసి పనిచేశామన్నారు. అక్కడే ఎన్నో రోజులు నిద్రపోయిన సందర్భాలు ఉన్నాయని.. తనకంటే కేవలం రెండు నెలలే పెద్దవాడని సీతారామశాస్త్రి గురించి చెప్పారు. తనను ఎంతో అప్యాయంగా పలకరించేవాడంటూ మరోసారి భావోద్వేగానికి లోనయ్యారు.