సీనియర్ నటి సుధ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. సుమారు 1000కి పైగా సినిమాల్లో నటించింది. అమ్మ, అక్క, అత్త ఇలాంటి పాత్రలు అంటే ముందుగా సుధానే గుర్తుకు వస్తుంది. తన నటనతో.. అమ్మ, అత్త అంటే ఇలా ఉండాలి అనే రేంజ్‌లో గుర్తింపు తీసుకువచ్చింది సుధ. సినిమాలను పక్కకు పెడితే.. నిజ జీవితంలో.. చాలా కష్టాలను అనుభవించింది సుధ. దీని గురించి ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ‘‘నేను పుట్టడమే.. ధనవంతుల ఇంటిలో పుట్టాను. బంగారం కూడా కాదు.. డైమండ్ స్పూన్‌తో పుట్టాను. పెద్ద ఇల్లు.. ఇంటి నిండా పని వాళ్లు, ముగ్గురు డ్రైవర్లు.. మహారాణిలా బతికాను. కానీ కళ్ల ముందే ఐశ్వర్యం అంతా కరిగిపోయింది. ఒకానొక సందర్భంలో.. కడుపు నింపుకోవడం కోసం తాళిబొట్టు అమ్ముకున్నాం. అలా జీవితంలో.. ఎంతో వైభోగం అనుభవించి.. తినడానికి తిండి కూడా లేని స్థితికి వచ్చాం’’ అని చెప్పుకొచ్చింది.
సుధ తన వ్యక్తిగత జీవితం గురించి ఇలా చెప్పుకొచ్చింది..‘‘మా ఇంట్లో నలుగురు మగపిల్లల తర్వాత.. నేను పుట్టాను. అందుకే అమృతం అన్న అర్థం వచ్చేలా.. సుధ అని.. అమ్మనాన్న నాకు పేరు పెట్టారు. చిన్నప్పటి నుంచి రాజసంగా బతికాను. ఇంట్లో ఉన్నప్పుడే.. ఒంటి మీద 20 తులాల బంగారు నగలు వేసుకునే దాన్ని. ఎంతో వైభోగం అనుభవించాను. అయితే నా తర్వాత తమ్ముడు పుట్టిన కొంత కాలానికే నాన్నకు క్యాన్సర్ అని తెలిసింది. అప్పటి నుంచి మా పరిస్థితి మారిపోయింది. నెమ్మదిగా ఆస్తి అంతా కరిగిపోసాగింది. నేను ఆరో తరగతి చదువుతుండగా అనుకుంటా.. ఇంట్లో తినడానికి ఏం లేకపోతే.. అమ్మ తన మంగళసూత్రం అమ్మి.. మాకు భోజనం పెట్టింది. అలా అన్ని ఉన్న స్టేజ్ నుంచి ఏమి లేని స్థాయికి చేరుకున్నాం’’ అని చెప్పుకొచ్చింది.
‘‘అమ్మ థియేటర్ ఆర్టిస్ట్ కావడంతో.. నన్ను కూడా యాక్టింగ్ ఫీల్డ్‌కు తీసుకొచ్చింది. అవకాశాలు రావడంతో.. నేను ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాను. నెమ్మదిగా పరిశ్రమలో నాకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాను. దాంతో డబ్బు, పేరు రావడం మొదలయ్యింది. అప్పటి నుంచి చుట్టాలు మావంక తిరిగి చూడటం మొదలుపెట్టారు. చిన్నప్పుడు ఎంతో వైభవంగా పెరిగిన నేను.. ఆ తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాను. కోలుకున్న తర్వాత.. ఢిల్లీలో హోటల్ ప్రారంభించడంతో.. మళ్లీ ఉన్న డబ్బంతా పోయింది. ఒక్క సంతకంతో వందల కోట్లు నష్టపోయాను. కొన్ని అప్పులను ఈ మధ్యకాలంలోనే తీర్చాను. ఇక నా కొడుకు విదేశీ అమ్మాయిని పెళ్లి చేసుకుని.. అక్కడే సెటిలైపోయాడు. నాతో గొడవపడ్డాడు. ఇప్పటికీ నాతో మాట్లాడటం లేదు’’ అని చెప్తూ సుధ ఎమోషనలైంది సుధ.