కొన్ని నెలలుగా టాలీవుడ్ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఒకరి తర్వాత ఒకరు ప్రముఖులు మృత్యువాత పడుతున్నారు. రెండు రోజుల క్రితం తారకరత్న మృతి చెందగా.. తాజాగా మరో ప్రముఖుడు కన్ను మూశారు. ఆ వివరాలు..
టాలీవుడ్‌ని వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. కొత్త ఏడాది ప్రారంభం నుంచి ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖలు మృత్యువాత పడుతున్నారు. ఒక విషాదం నుంచి తేరుకునేలోపే.. మరో విషాదం చోటు చేసుకుంటుంది. తాజాగా రెండు రోజుల క్రితం నందమూరి తారకరత్న మృతి చెందిన సంగతి తెలిసింది. 20 రోజులకు పైగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తారకరత్న కన్నుమూశారు. ఇక ఇదే నెలలో అనగా ఫిబ్రవరిలోనే కళాతపస్వి కె. విశ్వనాథ్ కన్నుమూసిన సంగతి తెలిసిందే. శంకరాభరణం చిత్రం ద్వారా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న కె.విశ్వనాథ్ ఫిబ్రవరి 2న మృతి చెందగా.. తాజాగా శంకరాభరణం చిత్రానికి ఎడిటర్‌గా వ్యవహరించి వ్యక్తి మృతి చెందారు. ఆ వివరాలు..
శంకరాభరణం, వేటగాడు సహా పలు ప్రతిష్టాత్మక చిత్రాలకు ఎడిటర్‌గా వ్యవహరించిన ప్రముఖ ఎడిటర్ జీజీ కృష్ణారావు మంగళవారం ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. రెండు వందలకు పైగా సినిమాలకు ఆయన ఎడిటర్‌గా పని చేశారు. ఎంతో మంది దిగ్గజ దర్శకుల సినిమాలకు ఎడిటింగ్ చేసిన అనుభవం జీజీ కృష్ణారావు సొంతం. ఎందరో దిగ్గజ దర్శకులతో పని చేసిన జీజీ కృష్ణారావు ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు.
ఇక జీజీ కృష్ణారావు తన సినీ కెరీర్‌లో దర్శక రత్న దాసరి నారాయణ రావు, కళా తపస్వి కె. విశ్వనాథ్, బాపు, జంధ్యాలతో పాటు తెలుగులో అనేక మంది ప్రముఖ దర్శకుల సినిమాలకు ఎడిటర్‌గా పని చేశారు. మరీ ముఖ్యంగా పూర్ణోదయా మూవీ క్రియేషన్స్, విజయ మాధవి ప్రొడక్షన్స్ నిర్మాణ సంస్థలకు ఆయన ఆస్థాన ఎడిటర్ అని చెప్పవచ్చు. ఆ సంస్థల నుంచి వచ్చే ప్రతి సినిమాకు ఆయనే ఎడిటర్. ఇక జీజీ కృష్ణారావు తన కెరీర్‌లో కమర్షియల్ సినిమాలతో పాటు కళాత్మక చిత్రాలకు కూడా ఎడిటింగ్ చేసి విమర్శకుల ప్రశంసలు పొందారు
ఇక కళాతపస్వి విశ్వనాథ్ తీసిన క్లాసిక్ ఫిల్మ్స్ ‘శంకరాభరణం’, ‘సాగర సంగమం’, ‘స్వాతి ముత్యం’, ‘శుభలేఖ’, ‘శృతి లయలు’, ‘సిరివెన్నెల’, ‘శుభ సంకల్పం’, ‘స్వరాభిషేకం’ చిత్రాలకు జీజీ కృష్ణరావే ఎడిటర్‌గా పని చేశారు. అలానే దాసరి నారాయణ రావు తీసిన కమర్షియల్ క్లాసిక్స్ ‘బొబ్బిలి పులి’, ‘సర్దార్ పాపారాయుడు’ సినిమాలకూ ఆయనే ఎడిటర్‌గా వర్క్ చేశారు. ఇక బాపు తీసిన ‘శ్రీరామ రాజ్యం’ సినిమాకు కూడా ఎడిటర్‌గా పని చేశారు. భవిష్యత్ ఎడిటర్లకు మార్గదర్శిగా నిలిచిన జీజీ కృష్ణారావు మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఈ ఏడాది ప్రారంభమైన రెండు నెలలో టాలీవుడ్ లెజెండ్స్ కొందరు ఈ లోకాన్ని విడిచి వెళ్ళారు. కళా తపస్వి కె. విశ్వనాథ్ ఫిబ్రవరి 2న మరణించారు. విశ్వనాథ్ తుదిశ్వాస విడిచిన మరుసటి రోజే అనగా ఫిబ్రవరి 3న ఆయన సినిమాల్లో పాటలకు గాను రెండుసార్లు ఉత్తమ గాయనిగా జాతీయ అవార్డు అందుకున్న లెజెండరీ సింగర్ వాణీ జయరామ్ కన్ను మూశారు. ఇక రెండు రోజుల క్రితం తారకరత్న మృతి చెందగా.. ఈ రోజు జీజీ కృష్ణారావు తుది శ్వాస విడవడంతో టాలీవుడ్‌లో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి.