సినీ ఇండస్ట్రీలో అప్పుడప్పుడు చెక్ బౌన్స్ అయిన కేసుల గురించి వింటూ ఉంటాం. ఒక్కోసారి నిర్మాతలు, సినిమాలకు సంబంధించి ఫైనాన్సియర్ లతో పాటు అడపాదడపా దర్శకుల పేర్లు కూడా ఈ చెక్ బౌన్స్ కేసులో వినిపిస్తుంటాయి. తాజాగా తమిళ దర్శకుడు లింగుసామిపై చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది చెన్నైలోని సైదాబాద్ కోర్టు. ప్రస్తుతం లింగుసామికి జైలు శిక్ష అని తెలిసేసరికి ఇండస్ట్రీలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
మరి ఏ సినిమా విషయంలో లింగుసామిపై చెక్ బౌన్స్ కేసు నమోదైంది? ఆ వివరాల్లోకి వెళ్తే.. హీరో కార్తీ, సమంత జంటగా ‘యెన్ని ఏలు నాల్’ మూవీ రూపొందించేందుకు తిరుపతి బ్రదర్స్ ప్రొడక్షన్ సన్నాహాలు చేసింది. ఈ సినిమాకు దర్శకుడు లింగుసామి. అయితే.. లింగుసామి తన అవసరాల నిమిత్తం పీవీపీ ఫైనాన్స్ కంపెనీ నుండి రూ. 1.35 కోట్లు అప్పుగా తీసుకొని నిర్మాతలకు ఇచ్చాడట. ఆ తర్వాత రూ. 35 లక్షలు పీవీపీ ఫైనాన్స్ కి చెక్ రూపంలో ఇచ్చినట్లు తెలుస్తుంది.
ఇక ఆ 35 లక్షల చెక్ బౌన్స్ అయ్యిందట. దీంతో సదరు ఫైనాన్స్ కంపెనీ.. లింగుసామిపై కోర్టులో కేసు వేసింది. ఈ కేసును విచారించిన సైదాబాద్ కోర్టు.. దర్శకుడు లింగుసామికి 6 నెలల జైలు శిక్షను విధిస్తూ.. తీసుకున్న డబ్బును వడ్డీతో పాటు చెల్లించాలని ఆదేశించింది. అయితే.. సైదాబాద్ కోర్టు తీర్పును సవాల్ చేస్తూ.. లింగుసామి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించనున్నట్లు సమాచారం. కాగా.. ఇటీవలే లింగుసామి రామ్ తో ‘ది వారియర్’ మూవీ తెరకెక్కించి ప్లాప్ ని ఖాతాలో వేసుకున్నాడు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.