రీ-ఎంట్రీలో పవర్ స్టార్ స్పీడు మామూలుగా లేదు. ఇప్పటికే ‘వకీల్ సాబ్’ను విడుదల చేసిన పవన్.. ఆ తర్వాత సాగర్ కె.చంద్ర, క్రిష్, హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి వంటి దర్శకులతో సినిమాలను లైన్లో పెట్టాడు. ఇక.. పవన్ సినిమాల లిస్ట్ ఇక్కడితో ఆగిపోలేదు. ఇదే స్పీడులో మరిన్ని మూవీస్ కి కమిట్ అవుతున్నాడట ఈ పవర్ ఫుల్ స్టార్. లేటెస్ట్ గా స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్.. పవన్ కళ్యాణ్ కోసం ఓ పవర్ ఫుల్ సబ్జెక్ట్ సిద్ధం చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్.
తెలుగులో విజయేంద్రప్రసాద్ కథలు అందించిన సినిమాలను ఎక్కువ శాతం రాజమౌళియే తెరకెక్కించాడు. ఇక.. పవర్ స్టార్ కోసం విజయేంద్రప్రసాద్ సిద్ధం చేస్తున్న కథను కూడా జక్కన్నే తెరకెక్కిస్తాడనేది ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. ప్రస్తుతం ‘ట్రిపుల్ ఆర్’తో బిజీగా ఉన్న రాజమౌళి.. ఆ తర్వాత మహేశ్ బాబుతో ఒక సినిమా చేయాల్సి ఉంది. మహేశ్ మూవీ తర్వాత కుదిరితే పవన్ కళ్యాణ్ తో రాజమౌళి కాంబో సెట్ అయ్యే అవకాశాలున్నాయట. ఏదేమైనా.. ప్రస్తుతానికి ఊహాగానంగానే ఉన్న ఈ క్రేజీ ప్రాజెక్ట్.. ఒకవేళ సెట్ అయితే పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పండగ లాంటి వార్తే అని చెప్పుకోవచ్చు.
పవన్ కళ్యాణ్ కోసం విజయేంద్ర ప్రసాద్ సిద్ధం చేసిన కథపై అప్పుడే చర్చలు కూడా నడుస్తున్నాయి. రాజమౌళి… మహేశ్ మూవీ పూర్తి చేసి వచ్చే సరికి ఏలాగో రెండేళ్ల సమయం పడుతుంది. ఆ తరువాత పవన్- రాజమౌళి సినిమా విడుదల సమయానికి ఏపీలో ఎన్నికల హీట్ వచ్చేసి ఉంటుంది. ఆ సమయంలో ఓ పవర్ ఫుల్ పొలిటికల్ డ్రామా గనుక రాజమౌళి డైరెక్షన్ లో పడితే.. జనసేనకి సైతం పెద్ద మైలేజ్ అవుతుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకునే విజయేంద్రప్రసాద్ ఓ పవర్ ఫుల్ పొలిటికల్ స్టోరీ సిద్ధం చేసినట్టు వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ విషయంలో పవన్ నుండి గాని, రాజమౌళి నుండి గాని త్వరలోనే ఏదైనా అధికారిక ప్రకటన వెలువడుతుందేమో చూడాలి.