మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా విభిన్న పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాను దర్శధీరుడు రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సుమారు రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌లో డి. వి. వి. దానయ్య నిర్మిస్తున్నారు. బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్, నటుడు అజయ్ దేవగన్ ఈ చిత్రం లో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
ఇక ఇటీవల విడుదల చేసిన దోస్తీ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఐదు భాషల్లో ఐదు గాయకులతో పాడించి రాజమౌళి కొత్త ప్రయోగానికి తెర తీశాడు. దీంతో ఇప్పటికే ఈ మూవీపై అంచనాలు తారా స్థాయికి పెరిగాయి. అయితే ఈ సినిమా షూటింగ్ దాదాపుగా దగ్గరపడ్డట్టే కనిపిస్తోంది. ఇక మొట్టమొదటగా ఈ మూవీని అక్టోబర్ 13న విడుదల చేయనున్నామని దర్శక నిర్మాతలు ప్రకటించారు. దీంతో ఎట్టకేలకు సినిమా విడుదల దగ్గర పడుతుందని అభిమానులు సంతోషంలో ఉన్నారు.
అయితే ఈ సినిమా విడుదలపై మాత్రం నీలినీడలు కమ్ముకున్నట్లు తెలుస్తోంది. ఇంకా రెండు మూడు నెలలే ఉండటంతో సినిమా విడుదల కష్టమని భావించారట చిత్ర యూనిట్. ఇంకా కొంత షూటింగ్ పెండింగ్‌లో ఉండటం, దాంతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ మొదలు కాకపోవటంతో మరింత ఆలస్యంగా విడుదల కానుందని తెలుస్తోంది. మరి ఇంతకు రాజమౌళి అనుకున్న తేదీకే ఆర్ఆర్ఆర్ సినిమాను విడుదల చేస్తారా లేదంటే మళ్లీ వాయిదా వేస్తారా అనేది తెలియాల్సి ఉంది.