తెలుగు బుల్లితెరపై వస్తున్న అసలు సిసలైన కామెడీ షో జబర్ధస్త్. గత ఏడెనిమిదేళ్ళుగా ఎంతోమందికి లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ వేదిక చాలామంది కమెడియన్స్‌ని వ్యక్తిగతంగా దగ్గర చేసింది. జబర్ధస్త్ కామెడీ షో తో పాపులర్ అయిన చాలా మంది సినీ ఇండస్ట్రీలో తమదైన కామెడీ పండిస్తున్నారు. జబర్ధస్త్ షో చూసేవారికి హైపర్ ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తన పంచ్ డైలాగ్స్ తో బుల్లితెర అభిమానులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. హైపర్ ఆది, రైజింగ్ రాజ్ స్కిట్ అంటే ఖచ్చితంగా టీవీ ముందు కూర్చోవాల్సిందే అన్నంత కామెడీ పండిస్తుంటారు. హైపర్ ఆది టీంలో రైజింగ్ రాజు ఎంత కీ రోల్ పోషిస్తాడో అందరికీ తెలిసిందే. ఆయన మీద ఎన్ని వేల సెటైర్లు పంచులు వేశాడో లెక్కపెట్టలేం. రాజు, శాంతి స్వరూప్, దొరబాబు ల మీద కౌంటర్లు వేస్తూనే స్కిట్లు ముందుకు తీసుకెళ్తుంటాడు.
జబర్దస్త్ ద్వారా తెలుగు ప్రేక్షకుల అందరికీ పరిచయమైన ఆది గురించి ఆయన టీం లీడర్ రైజింగ్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆర్నెళ్ల పాటు జబర్దస్త్‌లో రైజింగ్ రాజు కనిపించలేదు. ఆయన ఎక్కడున్నాడు? ఎందుకు జబర్దస్త్ వీడాడు అనేది కూడా ఎవ్వరికీ తెలియదు. అయితే రాజు లేకుండానే దొరబాబు, పరదేశీ లాంటి వాళ్ళతోనే స్కిట్స్ చేస్తూ ఎక్కడా ఫన్ మిస్ కాకుండా నవ్విస్తూ వచ్చాడు హైపర్ ఆది. ఇక రైజింగ్ రాజు స్కిట్ లో కనిపించకపోవడంతో పలు రకాల ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హైపర్ ఆది గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు రైజింగ్ రాజు. కరోనా సమయంలో రాజు జబర్దస్త్ కి దూరంగా ఉన్నాడు. మధ్యలో రాజుకి ఆరోగ్యం దెబ్బతింది. అలా కొన్ని రోజులు దూరంగా ఉండాల్సి వచ్చిందట. కానీ జబర్దస్త్‌కు దూరంగా ఉన్నా కూడా డబ్బులు మాత్రం రెగ్యులర్‌గా పంపించాడట. హైపర్ ఆది గురించి చెబుతూ రాజు కంటతడి పెట్టారు.
కరోనా సమయంలోనే తనకు మనవరాలు పుట్టిందని.. ఆ సమయంలో తాను బయటికి వెళ్తే పాపకు లేనిపోని ఆరోగ్య సమస్యలు వస్తాయేమో అని భయపడి ఇంట్లోనే ఉండిపోయానని రాజు చెప్పాడు. అయితే నేను బయటకు వెళ్లకుండా ఉన్న ఈ ఆరు నెలల సమయానికి కూడా ప్రతి నెలా నా పేమెంట్ బ్యాంక్ అకౌంట్ లో ఆది వేసేవాడిని, చిన్న వాడు అయిపోయాడు కానీ లేకపోతే ఆది కాళ్ళు మొక్కాలి అంటూ రైజింగ్ రాజు ఎమోషనల్ అయ్యాడు. ఆది నవ్వించడమే కాదు.. ప్రేమతో ఆదరించడం కూడా తెలుసు అని అన్నారు.