తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు హీరోయిన్ ప్రియా భవానీ శంకర్. ఆమె తాజా చిత్రం బొమ్మై విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
సాధారణంగా ప్రేమలో ఉన్నపుడు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవటం పరిపాటి. తరతరాలుగా కొనసాగుతూ వస్తున్న సంప్రదాయం ఇది. పుట్టిన రోజు నాడో.. లవర్స్ డే నాడో ఏదైనా మంచి బహుమతి ఇచ్చి ఎదుటి వ్యక్తిని సర్‌ప్రైజ్ చేయాలనుకునేవారు చాలా మంది ఉన్నారు. నిజానికి ఇలాంటి సర్‌ప్రైజ్‌లు ఎదుటి వ్యక్తిని ఎంతో సంతోష పెడతాయి కూడా. అయితే, కొన్ని సార్లు ఈ బహుమతుల్లో ఎదుటి వ్యక్తి మీద ప్రేమ కంటే.. ఖరీదే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అందుకే ఖరీదైన గిఫ్ట్‌లు ఇవ్వడాన్ని కానీ, తీసుకోవటాన్ని కానీ, కొంతమంది వ్యతిరేకిస్తూ ఉంటారు.
ఆ ఖర్చుతో ఇష్టమైన వారితో మరింత సంతోషంగా గడిపితే చాలు అనుకుంటూ ఉంటారు. ప్రముఖ హీరోయిన్ ప్రియా భవాని శంకర్ కూడా ఇలానే ఆలోచించారు. తన ప్రియుడికి బహుమతుల విషయంలో కఠినమైన షరతులు పెట్టారు. ఖరీదైన బహుమతులు ఇవ్వొద్దని ప్రియుడికి తేల్చి చెప్పారు. తాజాగా, బొమ్మై సినిమా ప్రమోషన్ల సందర్భంగా ఈ విషయాలను వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ..‘‘ నాకు ఎప్పుడూ బొమ్మల మీద ఆసక్తి లేదు. నేను 18 ఏళ్లకే ప్రేమలో పడ్డాను. రాజవేల్‌తో నా ప్రేమ మొదలైన నాటినుంచి అతడికి కొన్ని కఠిన షరతులు పెట్టాను. ఖరీదైన బహుమతులపై డబ్బులు వృధా చేయోద్దని చెప్పేదాన్ని.
వస్తువుల రూపంలోని బహుమతులు అవి మనతో ఉన్నంత కాలమే ఉంటాయి. అందుకే మేమిద్దం కలిసినపుడు తినే తిండి మీద, ఎంజాయ్ చేసే విషయాల్లో డబ్బు ఖర్చు చేయమని అతడికి చెప్పాను. ఆ జ్ఞాపకాలు జీవితాంతం మిగిలిపోతాయి’’ అని అన్నారు. ప్రియ తన ప్రియుడికి పెట్టిన ఈ షరతులు మగ నెటిజన్లకు బాగా నచ్చేశాయి. అమ్మాయిలంటే ఇలానే ఉండాలంటూ ప్రియను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. మరి, ప్రియుడికి ప్రియ పెట్టిన షరతులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.