మెగాస్టార్ చిరంజీవి దాన గుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన అవసరం ఉందని తన దగ్గరకు వచ్చిన వారికి మాత్రమే కాదు.. అవసరం ఉన్న వారిని వెతికి మరీ సాయం చేస్తుంటారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో దాన గుణం కలిగిన స్టార్ హీరోల్లో మెగాస్టార్ చిరంజీవి ముందు వరుసలో ఉంటారు. చిరంజీవి అవసరం ఉన్నవారికి కాదనకుండా సాయం చేస్తూ ఉంటారు. చేసిన సాయాన్ని బయటకు చెప్పరు. అయినా.. సాయం తీసుకున్న వారు బయటకు చెబుతూ ఉంటారు. అలా చిరంజీవితో సాయం పొందిన వారిలో తమిళ, తెలుగు నటుడు పొన్నంబలం ఒకరు. కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న పొన్నంబలంకు చిరంజీవి లక్షల రూపాయల సాయం చేశారు. ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం దాదాపు 40 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ విషయాన్ని కొన్ని నెలల క్రితం పొన్నంబలమే స్వయంగా మీడియాకు వెల్లడించారు.
తాజాగా, మరో సారి మీడియాతో మాట్లాడుతూ చిరంజీవి చేసిన సాయం గురించి చెప్పుకొచ్చారు. తాను కిడ్నీ సంబంధిత అనారోగ్యంతో ఉన్నపుడు తమిళ చిత్ర పరిశ్రమలో ఉన్న కొందరు డయాలసిస్ కోసం మాత్రమే సాయం చేశారని చెప్పారు. చికిత్సకు డబ్బులు లేక ఎంతో ఇబ్బందిపడ్డానని అన్నారు. ఓ రోజు తన అల్లుడు తనను ఆంజనేయస్వామి గుడికి తీసుకెళ్లాడని చెప్పారు. అక్కడ పూజ అనంతరం పూజారి చిరంజీవ, చిరంజీవ అన్నారని, ఆ సమయంలో తనకు చిరంజీవి పేరు గుర్తుకు వచ్చిందని తెలిపారు. చిరంజీవిని అడిగితే ఓ రెండు లక్షల వరకు సాయం చేస్తారేమోనని భావించానన్నారు.
తర్వాత మిత్రుడి ద్వారా చిరంజీవి నెంబర్ తీసుకుని ఫోన్ చేశానన్నారు. చిరంజీవి సాయం చేయటానికి ముందుకు వచ్చారని, రెండు లక్షలు ఇస్తారనుకుంటే ఏకంగా 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారని సంతోషం వ్యక్తం చేశారు. ఆయన చేసిన సాయాన్ని ఈ జీవితంలో మర్చిపోలేనని చెప్పారు. మరి, ఆ దేవుడే చిరంజీవి రూపంలో వచ్చి తనను బతికించాడంటున్న పొన్నంబలం మాటలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.