టాలీవుడ్ అగ్రహీరో పవన్ కళ్యాణ్ తన నటనతో, యాటిట్యూడ్ తో అశేషమైన అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లో హీరోగానే కాకుండా నిజ జీవితంలో కూడా పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు.
టాలీవుడ్ అగ్రహీరో పవన్ కళ్యాణ్ తన నటనతో, యాటిట్యూడ్ తో అశేషమైన అభిమానులను సంపాదించుకున్నారు. సినిమాల్లో హీరోగానే కాకుండా నిజ జీవితంలో కూడా పేదలకు సహాయ సహకారాలు అందిస్తూ రియల్ హీరో అనిపించుకున్నారు. పలు రకాల సామాజిక కార్యక్రమాలు చేస్తూ పేదల జీవితాల్లో వెలుగులు నింపారు. అయితే పూర్తి స్థాయిలో ప్రజలకు సేవ చేసేందుకు నిర్ణయించుకుని జనసేన అనే పేరుతో రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. ఇంకా కొన్ని నెలల్లో ఎన్నికలు రానుండడంతో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నారు. దీనిలో భాగంగా వారాహి విజయ యాత్రను ప్రారంభించారు. అంతకు ముందు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో యాగం నిర్వహించారు. వారాహి యాత్రలో భాగంగా అన్నవరం సత్య దేవుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారాహి యాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా కత్తిపూడిలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు పవన్ కళ్యాణ్.
ఆంధ్రప్రదేశ్ నుంచే జనసేన రాజకీయం మొదలవుతుందని వెల్లడించారు పవన్ కళ్యాణ్. నేను విడిగా వస్తానో, ఉమ్మడిగా వస్తానో నిర్ణయించలేదని తెలిపారు. పార్టీని నడపడం కోసమే సినిమాలు చేస్తున్నానని వెల్లడించారు. పాలించే వార నాకంటే నిజాయితీ పరులై ఉండాలని తెలిపారు. నాకోసం నేను రాజకీయాల్లోకి రాలేదని, ప్రజలకు సుపరిపాలన అందించడం కోసమే పార్టీ ఏర్పాటు చేశానని తెలిపారు. పార్టీకి వస్తున్న ఆదరణ చూసి కొంత మంది నాయకులు తనపై కక్ష్యగట్టారని తెలిపారు. అసెంబ్లీకి వెళ్లకుండా అడ్డుకునేందుకు కుట్రలు చేశారని చెప్పారు. నాకు చెగువేరా స్ఫూర్తి అని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఈసారి కచ్చితంగా అసెంబ్లీలో అడుగు పెడతానని స్పష్టం చేశారు. అసెంబ్లీలో అడుగుపెట్టకుండా ఎవరు ఆపుతారో చూస్తానంటూ గర్జించారు. భారీ ఎత్తున జరిగిన ఈ సభలో పెద్ద సంఖ్యలో అభిమానులు జనసేన కార్యకర్తలు హాజరయ్యారు.