సీనియర్ నటుడు నరేష్, ఆయన మూడో భార్యకు మధ్య తలెత్తిన వివాదంలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. రమ్యతో తనకు ప్రాణ హాని ఉందంటూ.. నరేష్ కోర్టును ఆశ్రయించాడు. తనను హత్య చేయించేందుకు రమ్య.. ఓ వ్యక్తికి సుపారీ ఇచ్చిందని.. దీనిలో భాగంగా కొన్ని రోజుల క్రితమే తన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహిచారంటూ నరేష్ కోర్టును ఆశ్రయించడం ప్రస్తుతం కలకలం రేపుతోంది. వీరిద్దరి వ్యవహారంలోకి మాజీ మంత్రి రఘువీరా పేరును లాగడం చర్చనీయాంశంగా మారింది. రఘువీరా రెడ్డి పేరుతో రమ్య బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఆ వివరాలు..
రమ్య రఘుపతితో నాకు ప్రాణ హాని ఉంది.. కర్ణాటక రౌడీ రాకేష్ శెట్టితో.. రమ్య తన ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించిందని.. ఓ పోలీసాఫీసర్ సాయంతో.. తన ఫోన్ ట్యాప్ చేయించింది అంటూ నరేష్ కోర్టును ఆశ్రయించాడు. రమ్య వేధింపులు తట్టుకోలేకపోతున్నానని.. తనకు విడాకులు ఇప్పించాల్సిందిగా కోర్టును కోరాడు. అంతేకాక పెళ్లైనప్పటి నుంచి రమ్య తనను వేధించేదని.. తిండి కూడా పెట్టేది కాదని ఆరోపించాడు. పైగా ప్రతీ ఫంక్షన్‌లో మద్యం తాగి రచ్చ చేసేది అని చెప్పుకొచ్చాడు. రమ్యకు తన మీద కన్నా కూడా.. డబ్బుపైనే ప్రేమ ఎక్కువ. ఆస్తిని కాజేయడానికి ప్రయత్నించింది అంటూ ఆరోపించాడు. అంతేకాక రఘువీరారెడ్డి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతుందని.. నరేష్ తనకు 10 కోట్ల రూపాయలు ఇస్తే సెటిల్ చేసుకుంటానంటూ బేరసారాలు జరిపిందని చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన ఆధారాలు అన్ని తన దగ్గర ఉన్నాయని చెప్పుకొచ్చాడు.
రమ్య రఘుపతి.. నరేష్ మూడో భార్య. వీరిద్దరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే వీరిద్దరి మధ్య సఖ్యత లేకపోవడంతో.. గత కొంత కాలంగా దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం నరేష్.. నటి పవిత్రా లోకేష్‌తో రిలేషన్‌లో ఉన్నాడు. వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు.. పవిత్రా లోకేష్ కోసమే నరేష్ తనకు విడాకులు ఇవ్వడానికి రెడీ అయ్యాడంటూ రమ్య రఘుపతి ఆరోపణలు చేసింది. ఇక తాజాగా చోటు చేసుకున్న ట్విస్ట్‌తో ఈ వివాదం మరింత ముదిరింది.