నందమూరి బాలకృష్ణ.. తెలుగు సినిమాతో ఆయన ప్రయాణం ఈనాటిది కాదు. స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.., కొన్ని దశాబ్దాలుగా ఆయన అగ్ర కథానాయకులలో ఒకరిగా కొనసాగుతూ వస్తున్నారు. ముఖ్యంగా పరిశ్రమకి ఏదైనా కష్టం వస్తే ముందు ఉండే బాలయ్య.., ప్రశ్నించడంలోనూ అంతే దూకుడు చూపిస్తుంటారు. పరిశ్రమలో ఆయన ఎప్పుడూ పదవులను కొరకపోయినా.., ఇండస్ట్రీ హితం కోసం పరితపిస్తుంటారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మరోసారి మా ఎన్నికల తీరుపై, కార్యవర్గ సభ్యులపై ప్రశ్నలు ఎక్కు పెట్టారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు ప్రతిసారి ఎందుకు ఇంత రచ్చకి కారణం అవుతున్నాయో తనకి అర్ధం కావడం లేదని బాలయ్య వ్యాఖ్యానించారు. గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న మనమంతా బహిరంగంగా చర్చించుకోవడం సరికాదని, అసోసియేషన్ ఎన్నికల్లో అర్టిస్టులు అంతా సమానమేనన్నారు బాలయ్య హితువు పలికారు. ఇక మా శాశ్విత బిల్డింగ్ విషయంలో బాలకృష్ణ స్పందించారు.
అసలు ఇప్పటి వరకు ‘మా’ బిల్డింగ్ ఎందుకు కట్టలేకపోతున్నారని సభ్యులను నిలదీశారు. అప్పట్లో ఫస్ట్ క్లాస్, టాప్ క్లాస్‌లో ఫ్లైట్‌లో అమెరికా వెళ్లిన చేసిన కార్యక్రమాల ద్వారా వచ్చిన డబ్బులు ఏమయ్యాయని ఆయపన ప్రశ్నించారు. ‘మా’బిల్డింగ్ నిర్మాణం కోసం మంచు విష్ణు ముందుకొస్తే, తాను సహకరిస్తానని చెప్పారు. తమతో పాటు సినీ పెద్దలంతా కలిసి వస్తే.. ఇంద్రభవనం నిర్మించుకోవచ్చని బాలయ్య అన్నారు.
ఇదే సమయంలో ఆయన కొన్ని రాజకీయ పరమైన వ్యాఖ్యలు కూడా చేశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో పెద్దలమని చెప్పుకునే చాలా మంది ప్రభుత్వంతో రాసుకుని పూసుకుని తిరుగుతున్నారు. అలాంటప్పుడు వీరు మా భవనం కోసం స్థలం అడిగితే.. ప్రభత్వం ఒక ఎకరం ఇవ్వదా అని బాలకృష్ణ ప్రశ్నించారు. మరి.., బాలయ్య వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఎలాంటి హీట్ పుట్టిస్తాయో చూడాలి.