ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఎప్పటికప్పుడు కొత్తనీరు వస్తూనే ఉంటుంది. జెనరేషన్స్ మారే కొలదీ ప్రేక్షకుల అభిరుచులు మారుతూ ఉంటాయి. కాబట్టి కొత్త నటులకు ప్రోత్సాహం లభిస్తూనే ఉంటుంది. ఇక డెబ్యూ మూవీతోనే యూత్ ఐకాన్స్ గా మారిన హీరోలు, హీరోయిన్లు సినీ చరిత్రలో చాలామందే ఉన్నారు. ఆ లిస్టులో కన్నడ కస్తూరి కృతి శెట్టి కూడా ఉంది. ‘ఉప్పెన’తో సంచలనం సృష్టించిన కృతి.. ఇప్పటికే నాని ‘శ్యామ్ సింగ రాయ్’, రామ్ – లింగుస్వామి, సుధీర్ బాబు ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ చిత్రాలలో నటించే ఛాన్స్ దక్కించుకుంది. ఇక ‘ఉప్పెన’ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కథానాయికగా నటించిన కృతి.. ఇప్పుడు అన్న సాయితేజ్ కి జోడీగా నటించబోతుందట. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు దర్శకత్వంలో ‘ఉప్పెన’ సినిమా వచ్చింది. ఇప్పుడు సుక్కూ మరో శిష్యుడు కార్తీక్ వర్మ దండు డైరెక్షన్ లో సాయితేజ్ హీరోగా ఒక సినిమా రూపొందుతోంది. ఈ మూవీలో కృతిని కథానాయికగా ఎంపిక చేశారట. సుకుమార్ స్క్రీన్ ప్లే అందిస్తూ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ మూవీని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్నారు. థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కే ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.కెరీర్ ఇలా సాఫ్ట్ సినిమాలతో సాఫీగా సాగిపోతున్న సమయంలోనే కృతి మరో ప్లాన్ వేసిందట.
హీరోకైనా, హీరోయిన్ కైనా ఎక్కువ కాలం నిలిచే పేరు తెచ్చేవి మాస్ మూవీస్ మాత్రమే. ఇందుకే కృతిశెట్టి రామ్ – లింగుస్వామి మూవీపై చాలానే అంచనాలు పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోయే ఈ మూవీ హిట్ అయితే ఉప్పెన వయ్యారికి పెద్ద హీరోల నుండి ఆఫర్స్ రావడం గ్యారంటీ. ఇందుకే కథలో తన పాత్రకి పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా కృతి ఈ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. నిజానికి ఈ పాటికే ఈ సినిమా షూటింగు కొంతవరకూ పూర్తికావలసింది. కానీ కరోనా కారణంగా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గుతూ ఉండటంతో, వచ్చేనెలలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా చెబుతున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ ను పూర్తిచేయించిన లింగుస్వామి, ఇతర పనులపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. ఈ సినిమా కనుక బాక్సాఫీస్ వద్ద హిట్ అయ్యి.., తనకి పెద్ద హీరోల సరసన అవకాశాలు తెప్పిస్తే తెలుగునాటే సెటిల్ అయిపోవాలని డిసైడ్ అయిపోయిందట కృతి. ప్రస్తుతం తెలుగునాట హీరోయిన్స్ కొరత ఎలానో ఉండనే ఉంది. పూజ హెగ్డే, రశ్మిక తప్పించి మేకర్స్ కి మరో ఆప్షన్ లేకుండా పోయింది. ఈ గ్యాప్ ని యూజ్ చేసుకుంటూ స్టార్ హీరోయిన్ గా ఎదిగితే తనకి తిరుగు ఉండదన్నది కృతిశెట్టి ఆలోచనగా తెలుస్తోంది. మరి.., కెరీర్ విషయంలో పెద్ద పెద్ద కలలు కంటున్న కృతిశెట్టి.. ఈ విషయంలో ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.