మరో అద్భుతమైన నటుడు ప్రేక్షకుల తన చిత్రాల్ని తీపి గుర్తులుగా మిగిల్చి వెళ్లిపోయారు. యముడు పాత్రలు అనగానే మనకు గుర్తొచ్చే కైకాల సత్యనారాయణ.. శుక్రవారం(డిసెంబరు 23) ఉదయం హైదరాబాద్ లో ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల దగ్గర నుంచి ఇప్పటి జనరేషన్ హీరోల వరకు దాదాపు అందరితోనూ నటించిన ఆయన మృతిపట్ల.. సినీ ప్రముఖులు, అభిమానులు, నెటజన్స్ సంతాపం తెలియజేస్తున్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం కైకాలతో తన బంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఆయనతో తనకున్న తీపి గుర్తులని నెమరవేసుకున్నారు. ట్విట్టర్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.
ఇక విషయానికొస్తే.. కైకాల సత్యనారాయణ ఇప్పటి సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ లతో నటించారు. కానీ వీళ్లలో చిరుతో కైకాల బాండింగ్ మాత్రం చాలా స్పెషల్. వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు. కైకాల అంటే చిరుకు ఎనలేని అభిమానం. వాళ్లింటికి తరుచూ వెళ్తుండేవారు కూడా. సినిమాలకు దూరమై, వేషాలు రాని టైంలోనూ చిరునే కైకాలకు అండగా నిలబడ్డారు. గతేడాది జులై 25న చిరునే.. కైకాల ఇంటికి వెళ్లి మరీ ఆయన పుట్టినరోజు వేడుకల్ని జరిపారు. ఆప్యాయంగా పలకరించి మరీ కైకాల యోగ క్షేమాలను చిరు అడిగి తెలుసుకున్నారు. ఆయన బెడ్ పై ఉండగానే కేక్ కట్ చేసి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ఇప్పుడు ఆయన మృతి చిరు భావోద్వేగానికి గురయ్యారు. ట్విట్టర్ లో కైకాలతో అనుబంధం గురించి రాసుకొచ్చారు. కొన్ని ఫొటోస్ కూడా పోస్ట్ చేశారు.
‘తెలుగు సినీ కళామతల్లి ముద్దుబిడ్డ, నవరస నటనా సార్వభౌముడు శ్రీ కైకాల సత్యనారాయణ గారు మృతి చెందడం నన్ను కలిచివేస్తోంది. ఆయనతో కలిసి ఎన్నో చిత్రాల్లో నటించాను. గొప్ప స్పాంటేనిటీ ఉన్న అరుదైన నటులు ఆయన. డైలాగ్ డెలివరీలో ఆయనది ప్రత్యేక పంథా. స్వచ్ఛమైన స్పటికం లాంటి మనిషి, నిష్కల్మషమైన మనసున్న మనిషి. నన్ను ‘తమ్ముడూ’ అని తోడబుట్టినవాడిలా ఆదరించారు. మా మధ్య అనుబంధం, ఆత్మీయత అంతకంతకూ బలపడుతూ వచ్చాయి. ఆయనతో నాకు ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయి. నటన, రుచికరమైన భోజనం రెండూ కైకాల సత్యనారాయణ గారికి ప్రాణం. నా శ్రీమతి సురేఖ చేతివంటను ఎంతో ఇష్టపడేవారు. క్రిందటేడాది, ఈ ఏడాది ఆయన జన్మదినం సందర్భంగా ఆయన స్వగృహానికి వెళ్లి శుభాకాంక్షలు తెలియజేయడం నాకు మిగిలిన సంతృప్తి. ఆ సందర్భంగా సత్యనారాయణ గారు సురేఖతో.. ‘అమ్మా ఉప్పు చేప వండి పంపించు’ అని అన్నప్పుడు.. ‘మీరు త్వరగా కోలుకోండి. ఉప్పు చేపతో భోజనం చేద్దాం’ అని అన్నాం. ఆ క్షణాన ఆయన చిన్నపిల్లాడిలా ఎంతో సంతోషపడిపోయారు. శ్రీ కైకాల సత్యనారాయణ గారు గొప్ప సినీ సంపదని అందరికీ అందించి వెళ్లిపోయారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని కోరుకుంటాం.’ అని చిరంజీవి ట్వీట్ చేశారు.
గత కొన్నాళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న కైకాల సత్యనారాయణ.. ఈ రోజు ఉదయం 4 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఉదయం 11 గంటల నుంచి కైకాల పార్థివ దేహానికి సినీ ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆయన నివాసంలో ఉంచనున్నారు. రేపు అనగా శనివారం కైకాల అంతక్రియలు జరపనున్నారు. ఇదిలా ఉండగా చిరు- కైకాల కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలొచ్చాయి. ఈ లిస్టులో కైకాల యముడిగా నటించిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు, యముడికి మొగుడు సినిమాలు బాక్సాఫీస్ ని షేక్ చేశాయి. స్టేట్ రౌడీ, కొదమ సింహం, బావగారు బాగున్నారా లాంటి చిత్రాలు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేశాయి. చిరు కెరీర్ లోనే బెస్ట్ గా నిలిచాయి. రుద్రవీణ, గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు సినిమాల్లోనూ కైకాల- చిరు కాంబినేషన్ సూపర్ సక్సెస్ అయింది.
Rest in peace
Navarasa Natana Sarvabhouma
Sri Kaikala Satyanarayana garu 🙏 pic.twitter.com/SBhoGATr0y— Chiranjeevi Konidela (@KChiruTweets) December 23, 2022