కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా.. ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరితో.. భారీ హిట్ చిత్రాలు తెరకెక్కించిన దర్శకుడు వివి వినాయక్. చిరంజీవి, బాలకృష్ణ మొదలు.. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి ఈ తరం హీరోలతో బ్లాక్‌బస్టర్ చిత్రాలు తెరకెక్కించాడు వినాయక్. మరీ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్‌కు మాస్ అప్పీల్ తీసుకొచ్చిన ఆది చిత్రానికి దర్శకుడు వినాయకే. ఈ సినిమాలో యాక్షన్ సీన్, లవ్, కామెడీ, ఎమోషన్స్ అన్ని సమపాళ్లల్లో ఉంటాయి. ఇక చిత్రంలో జూనియర్ చెప్పే డైలాగ్స్‌కు గూస్‌బంప్స్ వస్తాయి. ఆది అనే కాదు.. వినాయక్ తెరకెక్కించే ఏ చిత్రంలో అయినా సరే.. అన్ని ఎమోషన్స్ సమపాళ్లల్లో ఉంటాయి. ఒకప్పుడు టాలీవుడ్‌లో అగ్ర దర్శకుడిగా వెలుగొందిన వినాయక్.. ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉన్నాడు. చివరగా చిరంజీవి హీరోగా వచ్చిన ఖైదీ నంబర్ 150 వినాయక్ డైరెక్షన్‌లో వచ్చిన హిట్ సినిమా. ఆ తర్వాత తీసిన ఇంటిలిజెంట్ డిజాస్టర్‌గా నిలిచింది.
ఇక తన హిట్ సినిమాల గురించి ఎంత బాగా మాట్లాడతాడో.. ఫ్లాప్ చిత్రాల గురించి కూడా అంతే ఒపెన్‌గా మాట్లాడతాడు వినాయక్. తాజాగా ఓ ఇంటర్వ్యూలో అఖిల్ సినిమా ఫ్లాప్ అవ్వడం గురించి ఒపెన్ కామెంట్స్ చేశాడు వినాయక్. అక్కినేని అఖిల్‌ని హీరోగా పరిచయం చేస్తూ.. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం అఖిల్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం.. అనుకున్న ఫలితాన్ని సాధించలేదు. తాజా ఇంటర్వ్యూలో వినాయక్ అఖిల్ సినిమా డిజాస్టర్ గురించి మాట్లాడుతూ.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ సందర్భంగా వినాయక్ మాట్లాడుతూ..‘‘‘అఖిల్’ సినిమా విషయంలో మేం అనుకున్నది జరగలేదు. సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ వాటిని అందుకోవడంలో విఫలం అయ్యాము. అయితే నా సినిమా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదని అనుకున్నాను. ముఖ్యంగా బయ్యర్స్. అందుకే వారికి డబ్బులు తిరిగి ఇవ్వాలని భావించాను. ఇందకోసం ఓ పెద్ద మనిషిని మధ్యవర్తిగా పెట్టి… బయ్యర్స్‌కి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చి సెటిల్ చేసుకున్నాను. దీని గురించి నాకేం బాధ లేదు’’ అన్నాడు.
‘‘అయితే ఈ సినిమాకు సంబంధించి నాకున్న ఒక్కే ఒక్క భాద ఏంటంటే.. అఖిల్ నాతో సినిమా చేయాలని చాలా ఇష్టపడి, లవ్ చేసి ఈ మూవీలో యాక్ట్ చేశాడు. అలాంటి హీరోకి నేను సక్సెస్ ఇవ్వలేకపోయాననే బాధ ఇప్పటికీ ప్రతిరోజూ నన్ను వెంటాడుతుంది. అయితే అఖిల్ ఏదో ఒకరోజు పెద్ద సూపర్ స్టార్ అవుతాడు. ఆ విషయంలో నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇక నేను డైరెక్ట్ చేసిన అఖిల్ సినిమా అనేది తనకు మోయ్యలేనంత బరువుగా మారిపోయిందని అనుకుంటున్నాను. అది మా అత్యాశే అని అనుకోవాలి. రిలీజ్ విషయంలోనూ సీజీలు కాలేదు. ఓ రకమైన బాధలోకి వెళ్లిపోయాం. కనీసం సినిమాను కూడా పూర్తిగా కూడా చూడలేదు’’ అన్నాడు.