తెలుగు చలన చిత్ర రంగంలో ఎంతో మంది డైరెక్టర్లు ఉన్నారు. కానీ మెుదటి నుంచి తాను నమ్మిందే దైవంగా భావించి.. ఇప్పటికీ అదే పంథాను కొనసాగించే దర్శకులు చాలా తక్కువ మందే ఉన్నారని చెప్పాలి. అలాంటి అరుదైన డైరెక్టర్ల జాబితాలో ప్రముఖ దర్శకులు తేజ ఒకరు. సినిమాటోగ్రాఫర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తేజ. ‘చిత్రం’ సినిమాతో డైరెక్టర్ గా మారి మెగాఫోన్ పట్టుకున్నాడు. తొలి సినిమాతోనే తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేశాడు తేజ. ఈ సినిమాతోనే హీరో ఉదయ్ కిరణ్, హీరోయిన్ రీమాసేన్ లు వెండితెరకు పరిచయం చేశారు తేజ. అయితే వీరితో పాటుగా ఇప్పటి వరకు దాదాపుగా ఇండస్ట్రీకి 1000 మందికి పైగా నటీ, నటులను, కమెడియన్ లను, టెక్నీషియన్స్ ను పరిచయం చేసిన ఘనత డైరెక్టర్ తేజది. అలా తేజ పరిచయం చేసినవారిలో చాలా మంది నేడు ఇండస్ట్రీలో ఉన్నత స్థాయిలో ఉన్నారు. అలా ఉన్నత స్థాయిలో ఉన్న ఓ ప్రముఖ కమెడియన్ డైరెక్టర్ తేజ కోసం ఓ రూమ్ ను నిర్మించాడన్న వార్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
డైరెక్టర్ తేజ.. మూస పద్ధతిలో వెలుతున్న తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన శకానికి నాంది పలికాడు. ప్రేమ కథలలో కొత్త ఒరవడిని తెచ్చిందే కాక.. ఎంతో మంది కళాకారులను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. హీరో ఉదయ్ కిరణ్, రీమాసేన్, కాజల్ అగర్వాల్, ఆది పినిశెట్టి లాంటి స్టార్లు తేజ పరిచయం చేసిన వారిలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు తేజ. మీరు పరిచయం చేసిన వారిలో ఎవరైనా మీ మీద అభిమానం చూపించారా? అని యాంకర్ ప్రశ్నించగా.. చిరునవ్వుతో సమాధానం ఇచ్చారు.
“అసలు నేను పరిచయం చేసిన వారు నన్ను ఎందుకు గుర్తుపెట్టుకోవాలి? పరిచయం చేసినంత మాత్రానా గుర్తుపెట్టుకుంటారని నేను అనుకోను. కాకపోతే ఓ కమెడియన్ నన్ను గుర్తుపెట్టుకుని మరీ నా దగ్గరికి వచ్చాడు. సర్ మీ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను.. కొత్తగా ఇల్లు కట్టుకున్నాను అంటూ కాళ్ల మీద పడబోయాడు. కానీ నేను అతడిని లేపి.. నీలాంటి కొత్త వారిని పరిచయం చేస్తూ.. ఏదో ఒకరోజు నేను రోడ్డు మీదకు వస్తాను. కాబట్టి నువ్వు కట్టే ఇల్లులో నాకోసం ఓ రూమ్ ఉంచు. రోడ్డు మీద పడ్డాక ఎటు వెళ్లాలో తెలియక మీ ఇంటికి వస్తాను” అని అన్నట్లు తేజ చెప్పుకొచ్చారు.
ఇంతకీ ఆ ప్రముఖ కమెడియన్ ఎవరో తెలుసా? సుమన్ శెట్టి. హీరో నితిన్ నటించిన సూపర్ హిట్ మూవీ జయం చిత్రం ద్వారా కమెడియన్ గా వెండితెరకు పరిచయం అయ్యాడు సుమన్ శెట్టి. ఆ సినిమాలో నటనకు గాను నంది అవార్డును సైతం తీసుకున్నాడు. ఆ తర్వాత వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా మారిపోయడు సుమన్ శెట్టి. తేజ అన్నట్లుగానే అతని కోసం తన ఇంట్లో ఓ రూమ్ ను సైతం కట్టాడట సుమన్ శెట్టి. ఇప్పటికీ ఆ రూమ్ ను శుభ్రం చేస్తూ అలాగే ఉంచాడట. ఆ రూమ్ లో తన ఫోటో కూడా పెట్టుకున్నాడని డైరెక్టర్ తేజ ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు సుమన్ శెట్టికి గురువు పై ఉన్న ప్రేమను పొగుడుతూ.. ప్రశంసలు కురిపిస్తున్నారు.