తమిళనాట ఉన్న స్టార్ హీరోల్లో చియాన్ విక్రమ్ కూడా ఒకరు. భాషతో సంబంధం లేకుండా విక్రమ్ కు దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అటు తెలుగులోనూ విక్రమ్ కు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ఆయన తాజాగా నటించిన “పొన్నియన్ సెల్వన్-1” సినిమా టీజర్ ఈరోజు సాయంత్రం(జులై 8) విడుదల కావాల్సి ఉంది. ఇలాంటి తరుణంలో విక్రమ్ అభిమానులకు ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.
ఈరోజు చియాన్ విక్రమ్ ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబీకులు ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది. చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో ఐసీయూలో విక్రమ్ కు చికిత్స అందిస్తున్నట్లు తమిళ మీడియా పేర్కొంది. సాయంత్రం 6 గంటలకు చెన్నైలో జరగాల్సిన పొన్నియన్ సెల్వన్-1 సినిమా టీజర్ లాంచ్ కు విక్రమ హాజరు కావాల్సి ఉంది. ఈ వార్త తెలుసుకున్న విక్రమ్ అభిమానులు ఆయన క్షేమంగా తిరిగిరావాలంటూ ఆకాంక్షిస్తున్నారు.
అయితే తమిళ ఇండస్ట్రీతో సంబంధాలు ఉన్నవారు, విక్రమ్ సన్నిహితులు కొందరు మాత్రం హై ఫీవర్ తో ఆస్పత్రిలో చేరినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందంటున్నారు. అయితే చియాన్ విక్రమ్ ఆరోగ్యం విషయంలో మాత్రం అధికారిక ప్రకటన విడుదల కావాల్సి ఉంది.