తెలుగులో బిగ్‌బాస్ రియాలిటీ షోకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంగ్లీష్‌లో ప్రారంభం అయిన ఈ కాన్సెప్ట్ ఇండియా ప్రేక్షకులను కూడా ఉర్రూతళూగిస్తోంది. బాలీవుడ్లో ఎన్నో ఏళ్ల క్రితం ప్రారంభం అయిన ఈ షో సీజన్ల మీద సీజన్లు విజయవంతంగా కంప్లీట్ చేసుకుంటూ దూసుకువెళ్తోంది. ఇక తెలుగులో కూడా బిగ్ బాస్ షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇప్పటికే ఐదు సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకుంది. ఐదో సీజన్ పూర్తయిన వెంటనే కొత్తగా బిగ్ బాస్ ఓటీటీని ప్రారంభించారు. అయితే రెగ్యూలర్ షో మాదిరి ఇది ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దాని ఫలితం ఎలా ఉన్నా.. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 6ని ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇప్పటికే కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు తెర మీదకు వచ్చాయి. ఇక షో ప్రారంభం అయ్యేలోపు బిగ్ బాస్ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ ఎన్నో పేర్లు తెర మీదకు వస్తాయి. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర పేరు వినిపిస్తోంది. ఆ వివరాలు..
యాంకర్ ఉదయభాను గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలంగాణ యాసలో మాట్లాడుతూ బుల్లితెర ఆడియన్స్‌ని ఫుల్లుగా ఎంటర్టైన్ చేసింది ఉదయభాను. యాంకరింగ్‌లో కొత్త కోణం ఆవిష్కరిస్తూ బుల్లితెరపై తెగ హంగామా చేసింది. హీరోయిన్ రేంజ్ పాపులారిటీ కూడగట్టుకొంది. కానీ పెళ్లి చేసుకున్నాక క్రమంగా కెమెరాకు దూరమైంది. మళ్ళీ ఈ మధ్యకాలంలో అక్కడక్కడా కనిపిస్తోంది ఉదయభాను. ఆమె మైక్ పట్టిందంటే చాలు జనం ఊగిపోతున్నారు. దీంతో ఆమెకున్న ఆ క్రేజ్‌ను క్యాచ్ చేసుకోవాలని బిగ్ బాస్ నిర్వాహకులు పక్కా ప్లాన్ చేసినట్లు సమాచారం.
ఈ మేరకు ఉదయభానుకు బిగ్ బాస్ ఆఫర్ ఇచ్చారట. అయితే అందుకు ఆమె నుంచి పెద్దగా సుముఖత రాకపోవడంతో ఎలాగైనా ఉదయభానును ఒప్పించి బిగ్ బాస్ హౌస్‌లోకి తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారట. ఉదయభానుతో నేరుగా మాట్లాడి ఆమెను ఒప్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. అంతేకాదు ఇప్పటివరకు ఎవ్వరికీ ఇవ్వని రేంజ్ రెమ్మ్యూనరేషన్ కూడా ఆఫర్ చేసేందుకు సిద్దమయ్యారట. సో.. చూడాలి మరి బిగ్ బాస్ వేదికపై రావడానికి ఉదయభాను ఏ మేర ఇంట్రెస్ట్ చూపెడుతుందో. ఒకవేళ ఉదయభాను.. హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తే.. ఆమె ట్రోఫీ గెలవడం పక్కా అని ఉదయభాను అభిమానులు అప్పుడే జోరుగా ప్రచారం చేస్తున్నారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.