అభిమాన తారను ప్రత్యక్షంగా కలవాలని చాలా మంది కోరుకుంటారు. జీవితంలో వారికి ఒక్కసారైనా కలిసి.. ఫోటో దిగితే చాలు అనుకుంటారు. అలాంటిది ఏకంగా అభిమాన హీరో నుంచి ప్రత్యేక ఆహ్వానం అందితే.. హీరో ఇంట్లో రెండు రోజులు ఉండే అవకాశం లభిస్తే.. ఇదిగో ఈ యువకుడిలా భావోద్వేగానికి గురవుతారు. ఆ హీరో ఎవరంటే..
సినీతారలకు ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా తారలకు అభిమానులు ఉంటారు. ఇక తమ అభిమాన హీరో, హీరోయిన్‌ని ఒక్కసారైనా దగ్గర నుంచి చూడాలి, వారితో ఫోటో దిగాలని చాలా మంది కోరుకుంటారు. ఆ కల నిజమైన రోజున.. వారి ముఖాల్లో కనిపించే సంతోషాన్ని చూసి ఆనందించాలే కానీ.. వర్ణించడానికి మాటలు చాలవు. ఇ చాలా మంది తమ అభిమాన తారలను కలవడం కోసం దూరాభారం లెక్క చేయక సాహసాలు చేయడానికి కూడా వెనకాడరు. వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి మరీ అభిమాన తారలను కలుసుకుంటారు. ఇక తాజాగా ఓ వ్యక్తికి ఇదే పరిస్థితి ఎదురయ్యింది. అభిమాన హీరోని కలిసిన ఆ క్షణంలో సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. భావోద్వేగంతో కన్నీటిపర్యంతం అయ్యాడు. ఇంతకు ఎవరా వ్యక్తి.. అతడి అభిమాన హీరో ఎవరు అంటే..
ఆంధప్రద్రేశ్ అనకాపల్లి, గవరపాలెంకు చెందిన విజయ్ ఇలా తన అభిమాన హీరోని కలిసిన క్షణంలో భావోద్వేగంతో కంటతడి పెట్టాడు. ఇంతకు విజయ్ ఫేవరెట్ స్టార్ ఎవరంటే.. ఇంకెవరు.. మెగాస్టార్ చిరంజీవి. చిరుకున్నకోట్ల మంది అభిమానుల్లో విజయ్ కూడా ఒకడు. చిన్నతనం నుంచి చిరంజీవి డ్యాన్స్‌లు అంటే ఎంతో ఇష్టం. ఆ మక్కువతోనే చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాడు. ఢీ వంటి పలు టీవీ షోల్లో డ్యాన్సర్‌గా చేశాడు. డ్యాన్స్‌మాస్టర్‌గా, పలు ఈవెంట్లకు న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు విజయ్. ఏనాటికైనా చిరంజీవిని వ్యక్తిగతంగా కలవాలనేది విజయ్ చిరకాల కోరిక.
ఇక ఒక టీవీలో ప్రసారం అయిన డ్యాన్స్ షోలో విజయ్ బృందం ఫైనల్ వరకు నిలిచి.. విజయం సాధించింది. ఆ రోజు చిరంజీవి చేతులు మీదుగా విజయ్ టీమ్ ట్రోఫీ అందుకోవాల్సి ఉండే. కానీ అనివార్య కారణాల వల్ల ఆ షోకి చిరంజీవి రాలేదు. అలా తన అభిమాన హీరోని కలిసే అవకాశం మిస్సయ్యింది. ఆ తర్వాత విజయ్‌కి వివాహం అయ్యింది. భార్యతో కలిసి చైనాలో యోగా, డ్యాన్స్ మాస్టర్‌గా సెటిల్ అయ్యాడు. గత 12 ఏళ్లుగా వీరు చైనాలోనే ఉంటున్నారు. విజయ్ దంపతులు అతి క్లిష్టమైన ఆసనాలు వేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. తాజాగా ఈ జంట హైదరాబాద్ వచ్చింది. వీరు సాధించిన ప్రపంచ రికార్డుల నేపథ్యంలో పలు టీవీ చానెల్స్ విజయ్‌ని ఇంటర్వ్యూ చేశాయి.
ఈ సందర్భంగా విజయ్ చిరంజీవిపై తనకున్న అభిమానం, ఆయన చేతి మీదుగా ట్రోఫీ తీసుకునే అవకాశం మిస్సవ్వడం వంటి సంఘటనల గురించి వివరించాడు. ఈ విషయం కాస్త చిరంజీవి దృష్టికి వెళ్లింది. దాంతో ఆయన విజయ్‌ని తన ఇంటికి ఆహ్వానించాలని భావించారు. అప్పటికే విజయ్ చైనా వెళ్లాడు. కొద్ది రోజుల తర్వాత మళ్లీ ఇండియాకు వచ్చాడు. అప్పుడు చిరంజీవి విజయ్‌ని తన ఇంటికి ఆహ్వానించాడు. అభిమాన హీరో నుంచి పిలుపు రావడమే ఆలస్యం.. రెక్కలు కట్టకుని వెళ్లి వాలిపోయాడు విజయ్. భార్యాబిడ్డలతో కలిసి రెండు రోజుల పాటు చిరంజీవి ఇంట్లో ఉన్నాడు విజయ్.
ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. ‘‘నేను గిన్నిస్ రికార్డు సాధించినప్పుడు కూడా ఇంత సంతోషించలేదు. నా అభిమాన హీరో ఇంట్లో ఉండటం.. వారి చేతులు మీదగా ఆతిథ్యం స్వీకరించడం జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. నా జీవితంలో ఈ క్షణాలను ఎప్పటికి మర్చిపోను. చిరంజీవి గారు మా పిల్లలను దగ్గరకు తీసుకుని ఆడించారు. ఈ జన్మకు ఈ ఆనందం చాలు’’ అంటూ భావోద్వేగానికి గురయ్యాడు విజయ్. ఈ వార్త తెలిసి.. అభిమానిని ఇంటికి ఆహ్వానించి.. అతిథి మర్యాదలు చేసిన చిరంజీవి సంస్కారంపై ప్రశంసలు కురిపిస్తున్నారు మెగా ఫ్యాన్స్. మరి చిరంజీవి చేసిన పని మీకెలా అనిపించింది.. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.