ఈ మధ్య ఈవెంట్స్ లో సినిమాల ప్రమోషన్స్ కంటే కాంట్రవర్సీలే ఎక్కువవుతున్నాయి. వరుసగా అలాంటి ఇన్సిడెంట్సే జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఓ మూవీ ఈవెంట్ లోనూ సీనియర్ నటి రాధిక షాకింగ్ కామెంట్స్ చేశారు. అది మూవీకి సంబంధించిన విషయమే అయినప్పటికీ.. ఆడియెన్స్ లో మగాళ్లందరూ ఒక్కసారి ఆశ్చర్యపోయారు. ఈవిడ ఇలా మాట్లాడేశారేంటి అని అనుకున్నారు. దీంతో ఈ కామెంట్స్ కాస్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి. దానికి తోడు రాధిక చేసిన కామెంట్స్ ప్రస్తుత జనరేషన్ తగ్గట్లు ఉండేసరికి అందరూ నిజమే కదా అని డిస్కస్ చేస్తున్నారు.
ఇక వివరాల్లోకి వెళ్తే.. తమిళంలో ఈ మధ్య కాలంలో సూపర్ హిట్ గా నిలిచిన మూవీ ‘లవ్ టుడే’. పెళ్లికి సిద్ధమైన ప్రేమికులు, ఓ రోజంతా వాళ్ల ఫోన్లు మార్చుకుంటే ఏం జరుగుతుంది అనే కాన్సెప్ట్ తో తీసిన ఈ చిత్రం.. తెలుగులోనూ నవంబరు 25న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఆడియో ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలోనే సినిమా గురించి అందరూ మాట్లాడారు. ఇదే సినిమాలో యాక్ట్ చేసిన రాధిక మాత్రం.. ఓ అడుగు ముందుకేసి మగాళ్ల గురించి నిజాలు చెప్పేసింది. దీంతో ఈవెంట్ లో ఉన్న వాళ్లందరూ ఒక్కసారిగా అవాక్కయ్యారు.
‘పాత సినిమాల్లో చూస్తే ఒకరినొకరు ప్రేమించుకుంటారు. నువ్వు నా జీవితం అని చెబుతారు. శోభన్ బాబు, కృష్ణ సినిమాల్లో ఇద్దరేసి భార్యలు ఉంటారు. ఇద్దరూ భర్త కోసం పూజాలు చేస్తారు. మీలాంటి భర్త దొరకడం అదృష్టమండి అంటారు. ఇప్పుడు అదంతా అబద్ధం అయిపోయింది. ఇప్పుడు ప్రేమలు మారిపోయాయి. నిజంగా ఇక్కడ ఎవరైనా మగాడు ఉంటే.. నాకు ఒక్కరే అని చెప్పండి’ అని చెప్పిన రాధిక.. ఫన్నీగా సవాలు విసిరారు. వెంటనే రెస్పాండ్ అయిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ‘నాకు ఒక్కరే’ అని అన్నారు. ‘ఒక్కరే.. సైడ్ లో ఇద్దరు’ అని రాధిక పంచ్ వేశారు. ఒకరిని ప్రేమిస్తూ, మరొకరి గురించి అస్సలు ఆలోచించడం లేదు అనేవాళ్లు ఇప్పుడు లేరని, ఒకవేళ ఉన్నామని చెబితే అది అబద్ధమని రాధిక అన్నారు. దీంతో రాధిక వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.