తెలుగులో పలు చిత్రాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న నటి పద్మ జయంతి పాపులర్ కమెడియన్, దివంగత వేణు మాధవ్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.
టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్నంత మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, కమెడియన్లు ఇతర పరిశ్రమల్లో లేరు. తెరమీద కనిపించి వేలాది మంది నటీనటులు తమ నటనతో ప్రేక్షకులను అలరించారు. ఒకప్పుడు వెండితెరపై ఓ వెలుగు వెలిగిన ఎంతోమంది క్యారెక్టర్ నటులు ఇప్పుడు కనుమరుగైపోయారు. ఇటీవల సుమన్ టీవీ అటువంటి వారిని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంది. కష్టాల్లో ఉన్న సీనియర్ నటులు ఎంతోమంది తమ గోడు వెళ్లబోసుకోవడం చూశాం. వారికి సుమన్ టీవీ ఇంటర్వూల ద్వారా పరిశ్రమ వ్యక్తుల నుండి సాయం అందుతుంది కూడా. ఇదిలా ఉంటే, ఇండస్ట్రీకి చెందిన వారు ఇచ్చే ఇంటర్వూలు కానీ, చేసే కామెంట్స్ కానీ ఆసక్తికరంగా ఉంటాయి. అలాగే పలు వివాదాలకు కూడా కేంద్రబిందువుగా మారతాయి. సందర్భం వచ్చినప్పుడు గతంలో తమకు జరిగిన మోసం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారెంతోమంది ఉన్నారు. తాజాగా నటి పద్మ జయంతి పాపులర్ కమెడియన్, దివంగత వేణు మాధవ్ గురించి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. పద్మ జయంతి పేరు చెప్తే గుర్తు పట్టకపోవచ్చు కానీ చూస్తే మాత్రం ‘ఓ ఈమెందుకు తెలియదు’ అంటారు. తెలుగులో దాదాపు 400ల చిత్రాల్లో నటించి క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్నారామె.
కొద్ది కాలం క్రితం వరకు వరుసగా సినిమాలు చేస్తూ వచ్చిన పద్మ జయంతి.. ఈమధ్య కాలంలో పెద్దగా తెరమీద కనిపించడం లేదు. రీసెంట్‌గా ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వూలో తన గురించి చెప్తూనే.. స్టార్ కమెడియన్ వేణు మాధవ్‌తో పరిచయం, తమ పట్ల ఆయన ప్రవర్తించిన విధానం గురించి పలు సంచలన వ్యాఖ్యలు చేశారు పద్మ జయంతి. ఆమె మాట్లాడుతూ.. ‘మా వారి స్నేహితుడికి వేణు మాధవ్ పరిచయం. ఆయన వల్ల మా వారికి వేణు మాధవ్‌తో ఫ్రెండ్షిప్ అయ్యింది. అప్పటికి వేణు మాధవ్ ఇంకా ఆర్టిస్టుగా బిజీ కాలేదు. ఆయనకు పెళ్లి కూడా కాలేదు. ఒకసారి ఆయనకు ఆరోగ్యం బాగోలేకపోతే, మా వారికి కాల్ చేసి మా ఇంటి నుంచి క్యారియర్ పంపించమని చెప్పారు. అలా వేణు మాధవ్ అప్పుడప్పుడు షూటింగ్స్ నుంచి కూడా మా వారికి కాల్ చేయడం, ఆయన క్యారియర్ తీసుకెళ్లడం జరిగేది. అయితే వేణు మాధవ్ గారికి మా ఇంటి నుంచి భోజనం వెళ్లడం అనేది ఇండస్ట్రీ జనాల్లోకి తప్పుగా వెళ్లింది. నలుగురు మరోలా మాట్లాడుకోవడానికి కారణమైంది. మరోవైపు ఆయన ఆర్టిస్టుగా బిజీ అవుతుండడంతో నాకు కూడా ఏమైనా వేషాలు ఉంటే చెబుతాడేమో అనుకున్నాను. కానీ ఆయన మాత్రం మమ్మల్ని వాడుకున్నాడే కానీ తన వల్ల నాకు ఒక్క క్యారెక్టర్ కూడా రాలేదు’ అని చెప్పుకొచ్చారు.
అంతేకాకుండా, చాలా సార్లు రకరకాల ప్రాబ్లమ్స్ చెప్పి తన దగ్గరి నుండి చాలా డబ్బు కూడా తీసుకున్నాడని అన్నారు. ఆ డబ్బులు తిరిగివ్వలేదని.. ‘తాను ఆర్టిస్టుగా సినిమాలు చేస్తున్నా, తనకు అవకాశాలిప్పించే స్థాయి తనకున్నా కానీ వేషాలు ఇప్పించలేదు’ అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించారు. వేణు మాధవ్ గురించి పద్మ జయంతి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా తనదైన కామెడీతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బానవ్వించిన వేణు మాధవ్, అతి తక్కువ టైంలోనే స్టార్ కమెడియన్‌గా ఎదిగారు. వరుస అవకాశాలతో గ్యాప్ లేకుండా షూటింగ్స్ చేసేవారని.. స్పాట్‌లోనే మద్యం సేవించే వారని ఆయన అలవాట్ల గురించి రకరకాల వార్తలు వినిపించేవి. కొద్ది కాలం కిడ్నీ, లివర్ సమస్యలతో బాధపడుతూ సినిమాలకు దూరమైన వేణు మాధవ్ బతికుండగానే చనిపోయారని యూట్యూబ్‌లో వార్తలు రావడంతో మీడియా ముందుకొచ్చారు. కొద్ది రోజుల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్సపొందుతూ కన్నుమూశారు.