కమెడియన్ అలీ.. టాలీవుడ్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. బాలనటుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అలీ.. వందల సినిమాల్లో నటించారు. హీరోగా కూడా పలు సినిమాలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తనదైన కామెడీ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంటారు. ఒకవైపు సినిమాలు నటిస్తూనే బుల్లితెరపై కూడా పలు షోల్లో సందడి చేస్తున్నారు. ‘అలీతో సరదగా’ అనే షో ద్వారా బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఈ షో ద్వారా అనేక మంది సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తుంటారు. ఇలా అందర్ని ఇంటర్వ్యూ చేసే అలీని తాజాగా ప్రముఖ తెలుగు బుల్లితెర యాంకర్ సుమ కనకాల ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా అలీ.. తన సినిమా విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేసుకున్నారు. తన పెద్ద అక్క మృతి గురించి తలచుకుని ఎమోషనల్ అయ్యారు. తన గురించి ఎవరికి తెలియని పలు విషయాలను కూడా అలీ పంచుకున్నారు.
తనను ఓ కన్నతల్లిలా ఎంతో ప్రేమగా తన పెద్ద అక్క ఫాతిమా చూసుకునేదని అలీ అన్నారు. ఆమెపై ప్రేమతోనే తన కూతురికి ఫాతిమా అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఇంకా అలీ మాట్లాడుతూ.. ” మా పెద్ద అక్క నాపై ఎక్కువ ప్రేమ చూపించేది. నేను ఉదయాన్నే నిద్రలేవకపోతే.. తానే బాధ్యత తీసుకుని నన్ను నిద్రలేపేది. అంతేకాక నన్ను చక్కగా రెడీ చేసి షూటింగ్స్ కు కూడా పంపేది. అందరి కంటే ఆమే నన్ను ఎంతో ప్రేమగా చూసుకునేది. అలాంటి అక్క నాకు ఎనిమిదేళ్ల వయసు ఉన్నప్పుడు ఓ ప్రమాదంలో చనిపోయింది. ఆ ఘటన నా జీవితంలో చాలా విషాదమైనది. ఆమె ఎలా చనిపోయిందంటే.. అప్పటికే ఆమెకు ఓ బాబు పుట్టాడు. ఇక రెండో సారి గర్భవతిగా ఉంది. అయినప్పటికీ అన్ని ఇంటి పనులు చేస్తుండేది.
ఈ క్రమంలో రోజూ పిల్లవాడికి వేడి చేసి పాలు ఇస్తుండేది. ఓ రోజు బాబుకు వేడి పాలు గ్లాసులో పోసేటప్పుడు ఆమె ధరించిన చున్నీని వెనకకు వేసుకోగా దానికి నిప్పు అంటుకుంది. అలా క్షణాల్లోనే మంటలు ఆమె ఒళ్లంతా వ్యాపించాయి. మంటలకు తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది. దీంతో అక్కడ ఉన్న వాళ్లు మా అక్కను చూసి ఆమెపై నీళ్లు చల్లారు. అయినా ఆమె ప్రాణాలు మాత్రం దక్కలేదు. కడుపులో ఉన్న బిడ్డతో పాటు తను కూడా చనిపోయింది. ఆ ఘటన నన్ను ఎంతో కలచివేసింది. ఆమెపై ఉన్న ప్రేమతోనే నా పెద్ద కూతురుకు ఫాతిమా అని ఆమె పేరు పెట్టుకున్నాను” అని అలీ చెప్పుకొచ్చారు. అలీ.. తన జీవితం తెలిపిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.