కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో భారత్ బయోటెక్ మరో ముందడుగు వేసింది. ముక్కు ద్వారా వేసే డ్రాప్స్ మందును తీసుకొస్తోంది. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ సంస్థకి దరఖాస్తు చేసుకుంది. క్లినికల్ ట్రయల్స్ కు అనుమతిని ఇవ్వాలని కోరింది. ఇప్పటికే కొవాగ్జిన్ పేరుతో టీకాను తయారు చేసింది భారత్ బయోటెక్. ఇంజక్షన్ ద్వారా ఇచ్చే టీకా కంటే ముక్కులో చుక్కల మందు ద్వారా టీకా ఇవ్వడం ఇంకా సౌకర్యంగా ఉంటుందని సంస్థ తెలిపింది. ఎక్కువ మంది జనాభా ఉన్న భారత్లో చుక్కల మందును తేలిగ్గా పంపిణీ చేయవచ్చని చెబుతోంది.
చుక్కల మందును నెలకు 10 కోట్ల డోసుల చొప్పున తయారుచేయవచ్చని తెలిపింది. భారత్ బయోటెక్ ‘కొవాగ్జిన్’ కరోనా టీకాకు ఇప్పటికే అనుమతులు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో పాటు ఆక్స్ ఫర్డ్ – ఆస్ట్రా జెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన టీకాకు భారత ఔషధ నియంత్రణ సంస్థ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముక్కు ద్వారా ఇచ్చే చుక్కల మందు కరోనా టీకాను త్వరలోనే భారత్ బయోటెక్ నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.
క్లినికల్ పరీక్షలపై రెండున్నర నెలల్లో సమాచారం వెల్లడిస్తామని భారత్ బయోటెక్ వెల్లడించింది. ముక్కు ద్వారా ఇచ్చే కరోనా టీకా తయారీకి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ ఇన్ సెయింట్ లూయీస్ తో లైసెన్సింగ్ ఒప్పందం చేసుకున్న భారత్ బయోటెక్ .
మొదటి డోసు కోవాగ్జిన్, రెండో డోసు ముక్కు ద్వారా ఇస్తే వచ్చే ఫలితాలపై నిర్ధారించే యత్నాల్లో భారత్ బయోటెక్ ఉందని కాంబినేషన్ టీకా ప్రయోగాలకు డీసీజీఐ అనుమతి కోరినట్లు భారత్ బయోటెక్ తెలిపింది.