దేశంలో కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు వ్యాక్సినేషన్ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటివరకూ 75 కోట్లమందికి వ్యాక్సీన్ వేశారు. కరోనా నియంత్రణలో ఉండగా వైరస్ వ్యాప్తి చెందకుండా అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా అర్హులైన వారందరికీ మొదటి, రెండో డోస్ టీకాలు వేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. విద్యాసంస్థల్లో వంద శాతం వేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలోని వయోజనులకు వ్యాక్సినేషన్ వేయడం పూర్తవుతుందని భావిస్తున్నారు. అయితే ఇంతలో వెలువడిన ఒక అధ్యయన ఫలితాలు ఇప్పుడు ఆందోళన కలిగిస్తున్నాయి. ఐసీఎంఆర్ రీజనల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం కోవాగ్జిన్, కోవిషీల్డ్ టీకాలు తీసుకున్నవారిలో రెండు నెలల వ్యవధిలోనే యాంటీబాడీల స్థాయి తగ్గిపోతున్నది.
డాక్టర్ దేవదత్త భట్టాచార్య మాట్లాడుతూ తాము కోవిషీల్డ్ లేదా కోవాగ్జిన్ టీకాలు తీసుకున్న 614 మందిపై అధ్యయనం చేసి వారిలో యాంటీబాడీల స్థాయి గురించి ఆరు నెలల పాటు పరిశీలించామన్నారు. దీనిలో కోవిషీల్డ్ రెండు డోసులు తీసుకున్న వారిలో రెండు నెలల లోపునే యాంటీబాడీల స్థాయి తగ్గిపోతున్నదని తెలిపారు. అదేవిధంగా కోవాగ్జిన్ టీకా తీసుకున్నవారిలో మూడు నెలలోనే యాంటీబాడీల స్థాయి తగ్గిపోతున్నదని గుర్తించామన్నారు. బూస్టర్ డోసు అవసరం ఉందా లేదా అనేది తెలుసుకునేందుకే ఈ అధ్యయనం చేశామన్నారు.
అలాగే కొన్నాళ్ళ కిందట ఫైజర్ వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తర్వాత, ఆ టీకా ద్వారా శరీరంలో ఉత్పత్తయిన కొవిడ్ యాంటీబాడీలు 80% మేర తగ్గిపోతున్నట్టు ఓ అధ్యయనం వెల్లడించింది. కేస్ వెస్టర్న్ రిజర్వ్, బ్రౌన్ యూనివర్సిటీల శాస్త్రవేత్తలు సంయుక్తంగా దీన్ని చేపట్టారు. నర్సింగ్ హోమ్స్‌లో ఉంటున్న 120 మంది నివాసులు, 92 మంది ఆరోగ్య కార్యకర్తల నుంచి వారు రక్త నమూనాలను సేకరించారు. దీన్నిబట్టి చూస్తే వ్యాక్సినేషన్ ప్రకియ పూర్తయినా మన జాగ్రత్తలో మనం ఉండలనేది ఈ అధ్యయనాల సారాంశం చెప్తోన్న మాట.