గాంధీ ఆస్పత్రిలో అత్యాచార ఘటనలో కీలక పురోగతి లభించింది. నిందితుల్లో ఒకరైన సెక్యూరిటీ గార్డు విజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. అత్యాచార ఆరోపణలు వచ్చినప్పటి నుంచి సెక్యూరిటీగార్డ్ విజయ్ కనిపించకుండా పోయాడు. విజయ్‌ను పోలీసులు విచారించగా అత్యాచారం చేసినట్లుగా అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అత్యాచారం జరిగిన రోజు బాధితురాలు విజయ్‌తో కలిసి వెళ్లినట్లు సీసీటీవీ దృశ్యాల్లో గుర్తించారు. మరి, బాధితురాలు.. ఇష్టపూర్వకంగా వెళ్లిందా, లేదా బలవంతంగా తీసుకెళ్లాడా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగిస్తున్నారు. ఘటన తర్వాత కనిపించకుండా పోయిన బాధితురాలి సోదరి ఆచూకీ కూడా దొరికింది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా హిమాయత్‌నగర్‌లో నారాయణగూడ పోలీసులు గుర్తించారు. మహిళ సురక్షితంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఆమె చెప్పే విషయాలు ఈ కేసులో కీలకమయ్యే అవకాశం ఉంది.
ఈ కేసు విచారణ నిమిత్తం పోలీసులు మహబూబ్‌నగర్ వెళ్లారు. కేసుకు సంబంధించిన మరికొన్ని విషయాలను తెలుసుకున్నారు. అక్కాచెల్లెళ్లకు ఆల్కహాల్ విత్ డ్రాయల్ సింటమ్స్ ఉన్నట్లు గుర్తించారు. బాధితురాలిని రహస్య ప్రాంతంలో విచారించి.. మరోసారి ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. వాస్తవాలు పోలీసుల విచారణలో బయటకు వస్తాయని ఆస్పత్రి వర్గాలు అంటున్నాయి. గాంధీ ఆస్పత్రిలో మహిళను బంధించి లైంగికదాడికి పాల్పడ్డారనడానికి ఆధారాల్లేవని చెబుతున్నారు. ఆస్పత్రిలో భద్రత పటిష్టంగా ఉందన్నారు.
మూత్రపిండ సమస్యతో చికిత్స కోసం గాంధీకి వచ్చిన వ్యక్తికి సహాయకులుగా ఈ ఇద్దరు మహిళలు వచ్చారు. అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్ మహేశ్వరరావుతో పాటు మరికొందరు అత్యాచారం చేసినట్లు కేసు నమోదైంది. తన సోదరి కూడా కనిపించకుండా పోయినట్లు బాధితురాలు తెలిపింది. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు మహేశ్వరరావు సహా మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. బాధిత మహిళ కథనం ప్రకారం క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది.