మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్టుగా ఓ ప్రమాదంలో గాయపడిన వారు స్వస్థలాలకు వెళ్లే క్రమంలో మరో సారి ప్రమాదానికి గురై గాయపడ్డారు. ప్రమాదానికి గురైన కొద్ది గంటల్లోనే మరో ప్రమాదం వెంటాడడంతో భయబ్రాంక్తులకు లోనయ్యారు.
శుక్రవారం చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాదం పలు కుటుంబాల్లో విషాదం నింపింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో కోరమండల్ ఎక్స్ ప్రెస్ గూడ్స్ రైలును ఢీకొన్న ఘటనలో వందలాది ప్రయాణికులు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య 250కి పైగానే ఉన్నట్లు తెలుస్తొంది. అయితే ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను వారి స్వస్థలాలకు తరలించే క్రమంలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..
నిన్న(శుక్రవారం) జరిగిన కోరమండల్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారులు సహాయక చర్యలకు పూనుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్సఅందిస్తున్నారు. కోరమండల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లో ప్రయాణించిన ప్రయాణికుల కుటుంబాల్లో తమ వారికి ఏమైందో తెలియక, ఆచూకీ లభ్యం కాకపోవడంతో వారు తీవ్ర వేదనకు గురయ్యారు. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్ కు చెందిన కొంత మంది ప్రయాణికులు రైలు ప్రమాదంలో గాయపడ్డారు. వారికి స్థానిక ఆసుపత్రుల్లో చికిత్స అనంతరం వారి స్వస్థలానికి చేరవేసేందుకు ఓ బస్సును ఏర్పాటు చేశారు.
అయితే క్షతగాత్రులను తీసుకుని వెళ్తున్న ఆ బస్సు మరో ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనతో మరో సారి రైలు ప్రమాద క్షతగాత్రులు ఉలిక్కిపడ్డారు. మరోసారి ప్రమాదం వెంటాడడంతో భయాందోళనకు గురయ్యారు. పశ్చిమ బెంగాల్ లోని మేదినీపూర్ లో క్షతగాత్రులను తరలిస్తున్న బస్సు మరో వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో మరోసారి క్షతగాత్రులు గాయపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను సమీప ఆసుపత్రులకు తరలించారు. రైలు ప్రమాదంలో గాయపడిన వారు మళ్లీ ప్రమాదానికి గురికావడంతో స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.